23.5 C
Hyderabad
Wednesday, November 4, 2026

Live Video

spot_img

హైడ్రా… విమర్శల నుంచి ప్రశంసల వైపు

హైదరాబాద్‌లో దశాబ్దాల చరిత్ర కలిగిన చెరువులను ఆక్రమణ కోరల నుంచి రక్షించే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం  ఏర్పాటు చేసిన హైడ్రా యాక్షన్ మొదలైన తొలిరోజుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎంతలా అంటే హైడ్రా హైస్పీడ్ యాక్షన్ ఏకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవ్వడమే కాదు, ప్రతిపక్షాలకు పోరాట అస్త్రాలను ఇచ్చింది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ నేతృత్వంలో వేసిన ప్రతీ అడుగూ వివాదమే అయింది. ప్రతీ కూల్చివేతలో రాజకీయ రాద్దాంతమే జరిగింది. నాగార్జున ఎన్‌కన్వెషన్ మొదలు బడా బాబుల భవంతులు, పేరు మోసిన నిర్మాణాల వరకూ ఎవర్నీ వదల్లేదు హైడ్రా. మీడియా ఉతికి ఆరేసినా, ప్రతిపక్షాలు ఏకిపారేసినా.. డోన్ట్ కేర్ అంటూ హైస్పీడ్ బుల్డోజర్‌లా దూసుకెళ్లింది. హైడ్రాకు హైకోర్టు బ్రేక్‌లు వేసింది. సెలవురోజుల్లో కూల్చివేతలు ఎందుకంటూ నిలదీసింది. నలువైపుల వచ్చిన విమర్శలు ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా హైడ్రా స్పీడ్ తగ్గింది. వ్యూహం మారింది. ఇప్పుడు ఆచి తూచి అడుగులేస్తూ యాక్షన్‌లోకి దిగుతోంది. హైడ్రా కూల్చివేతల వల్ల ఎంతో మంది ఇళ్లు కోల్పోయారు. భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.

ఇంత జరుగుతున్నా మా లక్ష్యం చెరువుల పునరుద్దరణ, భావితరాల భవితవ్యం అంటూ హైడ్రా చెప్పుకొస్తోంది. నేటీకి అదే సంకల్పంతో ముందుకు సాగుతోంది. తాజాగా జరిగిన ఓ ఘటన హైడ్రా లక్ష్యం సరైనదే, విమర్శలను ఎదిరించి చేసిన పనిలో న్యాయమైందే అని నిరూపించింది. బతుకమ్మ కుంట చెరువు హైడ్రా చర్యలను సమర్థించింది. అంబర్‌పేట మండలంలోని బాగ్ అంబర్ పేటలో ఉన్న బతుకమ్మ కుంట చెరువు దాదాపు ఎనభై శాతంపైగా ఆక్రమణకు గురైంది. 16 ఎకరాల చెరువు కాస్తా 5 ఎకరాలకు వచ్చింది. అది కూడా పూర్తిగా ముళ్ల కంచెలతో నిండిపోయి. దీన్ని కూడా కబ్జాదారులు హస్తగతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో స్థానికులు సమస్యను హైడ్రాకు చేరవేశారు. మా బతుకమ్మ కుంటను బతికించండి అంటూ వేడుకున్నారు.

రంగంలోకి దిగిన హైడ్రా బుల్డోజర్‌లు ఈసారి చెరువు ఆక్రమించిన ప్రాంతాన్ని వదిలేసి మిగతా ప్రాంతంలో ముళ్లకంచెలు తొలిగించేందుకు రెడీ అయింది. అలా బుల్డోజర్లు భూమిని తాకగానే గంగమ్మ ఉబికి వచ్చింది. ఇక్కడ చెరువు లేదు అన్నవాళ్ల నోళ్లు మూయించేలా బతుకమ్మకుంటలో దాగిన నిజం వెలుగులోకి వచ్చింది. తొలిరోజుల్లో చెరువు ఆక్రమించి కట్టిన ఇళ్లు కూల్చివేసి 16 ఎకరాల చెరువును వెలుగులోకి తెచ్చేది కానీ మారిన హైడ్రా అలాంటి సాహసం చేయలేదు.  మిగలిన 5 ఎకరాలు బాగుచేసి చెరువును సుందరీకరణ చేసే పనిలో నిమగ్నమైంంది. ఈ బతుకమ్మ కుంట చెరువు వద్ద ఉబికి వచ్చిన నీరు అనేక ప్రశ్నలకు సమధానం మాత్రమే కాదు… హైడ్రాను తిట్టిపోస్తున్న గొంతుకలకు ఆనకట్ట కట్టింది. హైడ్రా చెరువులను రక్షిస్తే.. భారీ వర్షాలకు ముంపు అనే మాట కనుచూపుమేరలో కనపడదు. తాగునీటి సమస్యకు సైతం పరిష్కారం చూపడమేకాదు, భావి తరాలకు బంగారు భవిష్యత్ ఇవ్వొచ్చు. ఇదే కదా హైడ్రా చెప్పింది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదే కదా ఇప్పుడు బతుకమ్మ కుంటతో రుజువైందని అంటున్నారు. అందుకే విమర్శించిన గొంతులు సైతం ఇప్పుడు వారెవ్వా హైడ్రా అంటున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com