- రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్ అధిష్టానానికి గ్యాప్ వచ్చిందా…?
- ముఖ్యమంత్రికి రాహుల్ టైం ఇవ్వడం లేదనే ప్రచారం ఎందుకు జరుగుతోంది
- బలమైన రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ ప్రభువులు అండగా నిలవడం లేదా
- ఇది పార్టీకే ప్రమాదం అంటున్న సీనియర్లు
రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి అధిష్టానానికి మధ్య గ్యాప్ ఉందా…. లేదని పైకి చెప్తున్నా పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే గత కొద్దికాలంగా అధిష్టానం తెలంగాణ నాయకత్వం విషయంలో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తుందనే ప్రచారం పార్టీలో బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన రాష్ట్రం తెలంగాణ. ఇక్కడి నాయకత్వం కూడా చాలా బలంగా ఉంది. పైగా ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అటువంటి నాయకత్వానికి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వెన్నుదన్నుగా నిలబడితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కంచుకోట అవుతుంది. కానీ అదేం విచిత్రమో కానీ ప్రజాబలం ఉన్న నాయకులను పార్టీ క్యాడర్ గుండెల్లో పెట్టుకున్న నాయకులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముప్పతప్పలు పెట్టడం ఈరోజు కొత్తేమీ కాదు. అనాదిగా ఆపార్టీ సంస్కృతి అదే. అందుకు ఇప్పుడు అధఙకారం కోల్పోయినా పదేళ్ళ పాటు మళ్ళీ అధికారం దక్కించుకోలేని స్ధితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.
సాధారణంగా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ పార్టీలకు సంబంధించిన అగ్ర నాయకులను కలవడం జాతీయ పార్టీల్లో ఆనవాయితీగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ఢిల్లీ వచ్చిన సాధారణంగా రాహుల్ గాంధీని మల్లికార్జున్ ఖర్గేని కలుస్తారు. అయితే తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, సీనియర్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లాంటి వాళ్లు ఢిల్లీలో ఉన్నప్పటికీ వాళ్ళను కలిసేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకులకు సమయం దొరకడం లేదు. చాలాకాలం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కలవడం లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అది ఎంత వరకూ నిజమో వారిద్దరికే తెలియాలి. తాను ఎప్పటికప్పుడు అన్ని విషయాలు రాహుల్ గాంధీతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు రేవంత్ రెడ్డి చెపుతున్నప్పటికీ పార్టీ క్యాడర్‌లో మాత్ర రాహుల్, రేవంత్‌ల మధ్య గ్యాప్ ఉందనే అంశం తొలిచెస్తోంది. ఇటువంటి ఒక ప్రచారం జరుగుతున్నప్పుడు దాన్ని క్లియర్ చేయవల్సిన బాధ్యత అధిష్టానంపైనే ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్కడా కనపడటం లేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఎంతో ధైర్యంతో చిత్తశుద్దితో తెలంగాణ రాష్ట్రంలో కులగణను విజవంతంగా పూర్తి చేశారు. రేవంత్‌రెడ్డి చేసిన ఈ పనని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్ధాయిలో తన ప్రచారాస్త్రంగా, ఒక విధానపరమైన నిర్ణయంగా తీసుకుంది. ఈ విషయాన్ని పార్లమెంటులో సైతం రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కులగణన అనేది రేవంత్‌రెడ్డి బ్రెయిన్ చైల్డ్. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఎజెండాను రేవంత్‌రెడ్డి ఇచ్చారని చెప్పవచ్చు. అటువంటి రేవంత్‌రెడ్డి మిగితా ముఖ్య నాయకులతో ఢిల్లీ వెళితే ఆ బృందాన్ని కలిసే తీరిక రాహుల్‌గాంధీకి లేకపోవడం పార్టీ శ్రేణులకు విచిత్రంగా అనిపిస్తోంది. ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత అంసతృప్తి నెలకొన్న మాట వాస్తవమని సీనియర్లు అంటున్నారు.
ఢిల్లీలో అందుబాటులో ఉండి కూడా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేందుకు టైం ఇచ్చినా రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రులు, పీసీసీ అధ్యక్షడు కలసి వెళితే వాళ్లను కలవడానికి టైమ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని టీకాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పార్టీకే నష్టం జరుగుతుందన్నది సీనియర్ల అభిప్రాయం. ఏ విషయమైనా కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోతుంది తప్ప ఇలా ప్రభుత్వాన్ని పార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరించడం పార్టీ పెద్దలకు సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకరకంగా చెప్పాలంటే పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన రేవంత్‌రెడ్డికి అధిష్టానం ఫ్రీ హ్యండ్ ఇవ్వాలని టీకాంగ్రెస్ సీనియర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మంత్రి మండలి విస్తరణకు సంబంధించి ఇంత జాప్యం తగదని, అది ఒక రకంగా ముఖ్యమంత్రిని బలహీనపరుస్తుందని అంటున్నారు. అవకాశం ఉన్న మరో ఆరు మంది మంత్రులను క్యాబినేట్ లో చేర్చుకోవడం ద్వారా శాఖలకు న్యాయం జరుగుతుందని దీని వల్ల రేవంత్ రెడ్డి వద్ద ఉన్న అనేక శాఖలను వారికి కేటాయించి ముఖ్యమంత్రిగా రేవంత్ మరింత మెరుగ్గా పనిచేసే అవకాశం చిక్కుతుందన్న అంశాన్ని టీ కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఇదే పద్దతి కేంద్ర నాయకత్వం అనుసరిస్తే భవిష్యత్తులో పార్టీకి నష్టం జరుగుతుందని వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు లో చులకన కావడమే కాకుండా ప్రజల్లో కూడా అనుమానాలు వచ్చే రీతిలో కేంద్ర నాయకత్వం వ్యవహరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.