బీజేపీకి అసలైన కిక్ ఇచ్చిన ఢిల్లీ, మిల్కీపూర్
భారతీయ జనతాపార్టీ.. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టినప్పటికీ ఆ గెలుపు అధిష్టానానికి కిక్ ఇవ్వలేదు. ఎందుకంటే గడిచిన రెండు పర్యాయాల కన్నా ఈ సారి అత్యధిక సీట్లు గెలుచుకొని సొంతంగా కేంద్రంలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ కలలు కన్నది. కానీ, మిత్రపక్షాలు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. అంతేకాదు.. లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. అక్కడ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఎంపీగా విజయం సాధించారు. రెండు శతాబ్దాల నుంచి నడుస్తున్న వివాదానికి ఫుల్‌స్టాప్ పడేలా చేసి.. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించింది కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం. కానీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి లోక్‌సభ స్థానంలో మాత్రం.. బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈ అంశం ప్రధానంగా చర్చల్లో నిలిచింది.
అయితే, ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతాపార్టీ సత్తా చాటుతోంది. ఆపూర్వ విజయాలను నమోదు చేసుకుంటోంది. గత యేడాది అక్టోబర్‌లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. వాస్తవానికి ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ.. హర్యానాలో కాంగ్రెస్‌పార్టీ గెలుస్తుందని ప్రకటించాయి. కానీ, ఎవరూ ఊహించనివిధంగా బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. అలాగే, గత యేడాది నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.
ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలోనూ కాషాయ జెండా ఎగిరింది. దాదాపు మూడు దశాబ్దాలుగా తీరని కలగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఈసారి అధిరోహిస్తోంది. శనివారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి పట్టం కట్టాయి. దేశ రాజధాని కేంద్రంగా కేంద్రప్రభుత్వాన్ని నడిపిస్తోన్న బీజేపీకి.. అక్కడి రాష్ట్ర అసెంబ్లీని చేజిక్కించుకోకపోవడం ఇన్నాళ్లు ఓ లోటుగా ఉండేది. కానీ, ఆ లోటు కూడా ఇప్పుడు తీరిపోయింది. ఈ విజయాన్ని కమల దళం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది.
ఇక, ఇవాళే వెలువడిన ఉత్తర ప్రదేశ్‌లోని మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం కూడా బీజేపీలో జోష్ నింపింది. ఎందుకంటే.. మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం.. అయోధ్య లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిన బీజేపీ.. ఇప్పుడు ఆ స్థానం పరిధిలోని మిల్కీపూర్‌లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో కాషాయ పార్టీ సంబరాలు చేసుకుంటోంది.
మొత్తానికి భారతీయ జనతాపార్టీకి 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత అన్నీ అనుకూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. మెజారిటీ ఎన్నికల్లో విజయాలే నమోదవుతున్నాయి. అయితే, ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న విజయంతో పాటు.. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పార్లమెంటు స్థానం పరిధిలోకి వచ్చే మిల్కీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతో బీజేపీకి అసలైన కిక్ వచ్చిందంటున్నారు.