హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ చార్జీల పెంపు దాదాపుగా ఖరారైపోయింది. ప్రయాణికులపై భారం పెంచే దిశగా ఎల్ అండ్ టీ నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటికే కొంతకాలంగా టికెట్ రేట్ల పెంపుపై చర్చలు సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఛార్జీల నిర్ణయ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ) ఇచ్చిన సూచనల ఆధారంగా టికెట్ ధరలు పెంచాలని ఎల్ అండ్ టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అనుమతి కోరనున్నారు. ఇప్పటికే ఈ విషయం సీఎం దృష్టిలో ఉండడంతో సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆశిస్తున్నారు. అనుమతి లభించిన వెంటనే ఈ నెల 10 నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి రావచ్చని చెబుతున్నారు. ఈ పెంపుతో కనిష్ఠ ఛార్జీ రూ.15 నుంచి గరిష్ఠంగా రూ.75 వరకు ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్ మెట్రో మొదటి దశలో ఎల్ అండ్ టీ సంస్థ ప్రాజెక్టును చేపట్టి 2017 నవంబరులో పూర్తిచేసింది. మియాపూర్-ఎల్బీ నగర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోలు-రాయదుర్గం మార్గాల్లో మొత్తం 69.2 కిలోమీటర్ల పరిధిలో మెట్రో మార్గాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 1,200 మెట్రో సర్వీసులు నడుస్తుండగా, దాదాపు 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీకెండ్‌లు, సెలవుల్లో ప్రయాణికుల సంఖ్య 5.10 లక్షల వరకు చేరుతోంది.
కరోనా సమయంలో ఆదాయానికి పెద్ద దెబ్బతగిలింది. 2020 నుంచి 2022 మధ్య ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అంతేకాకుండా, మాల్స్, ప్రకటనల ద్వారా రావాల్సిన ఆదాయం కూడా ఆశించిన మేరకు రాలేదని ఎల్ అండ్ టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన 267 ఎకరాల భూమిలో కొద్దిమేరలోనే వాణిజ్య ప్రాజెక్టులు నిర్మించ గలిగారు. చాలా భూములు ఖాళీగా ఉండటంతో అంచనా వేసిన ఆదాయం రాలేదని వారు అంటున్నారు. మరోవైపు, ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తుండడంతో మెట్రోపై ప్రయాణ భారం పెరిగిందని పేర్కొంటున్నారు.
2022 సెప్టెంబరులో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ.. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందనగా కేంద్రం ఎఫ్‌ఎఫ్‌సీని నియమించింది. కమిటీ నగరంలోని ప్రజాభిప్రాయాన్ని పరిశీలించి నివేదిక సమర్పించింది. కానీ 2023లో ఎన్నికల వాతావరణం కారణంగా పెంపు ప్రక్రియ ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎల్ అండ్ టీ తిరిగి అనుమతి కోరే యత్నాలు మొదలుపెట్టింది.
మెట్రో టికెట్ రేట్లను సవరించేందుకు ఎల్ అండ్ టీకి స్వతంత్ర అధికారం ఉందని సంస్థకు చెందిన ఓ కీలక అధికారి తెలిపారు. మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 2002 ప్రకారం చార్జీల సవరణ సాధ్యమని అన్నారు. ఈ ఏడాది బెంగళూరులో ఎఫ్‌ఎఫ్‌సీ నివేదిక ఆధారంగా 50 శాతం రేట్లు పెంచిన ఉదాహరణను సూచిస్తూ, హైదరాబాద్‌లో 25 నుంచి 30 శాతం వరకూ పెంపు నిర్ణయించినట్లు చెప్పారు. దీనివల్ల ఏటా రూ.150 నుంచి రూ.170 కోట్ల వరకు అదనపు ఆదాయం రాబట్టవచ్చని, తద్వారా నష్టాలను కొంత మేర తగ్గించుకునే అవకాశముందన్నారు.