రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారం అందిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. బిల్డర్స్ కు స్వర్గధామం హైదరాబాద్ అని అభివర్ణించారు. హైదరాబాద్ నోవాటెల్ లో ఈరోజు (శనివారం) జరిగిన బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
హైదరాబాదును గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకున్నామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాదులో డీజిల్ వాహనాలను దశలవారీగా ఎలక్ట్రికల్ వాహనాలుగా మారుస్తామన్నారు. ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఫ్యూచర్ సిటీ.. ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
మూసి పునర్జీవన ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని… మూసీ సుందరీకరణకు ముందుకు పోతామని చెప్పారు. ఆధునిక దేశాల బాటలో తెలంగాణను నడిపిస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరించారు.