ధరల చదరంగంలో మిర్చి రైతులు నిలువునా దగా పడుతున్నారు. కాచుకొని కూర్చున్న వ్యాపారులు.. అదును చూసి దెబ్బకొట్టారు. ఇదే గత యేడాది ఇదే సీజన్‌లో క్వింటా మిర్చికి రూ.22 వేల చొప్పున చెల్లించిన ఖరీదుదారులు.. ఈ ఏడాది ఇదే సీజన్ నాటికి ధరలను అమాంతం తగ్గించారు. ఖరీదు దారుల వ్యూహానికి ధరలు నేలచూపులు చూస్తుండడంతో ఎర్ర బంగారం రైతులు బోరుమంటున్నారు. గత యేడాది క్వింటా మిర్చిని రూ.22 వేల నుంచి రూ.23 వేల మధ్య కొనుగోలు చేయడంతో అన్నదాతలు ఈ పంట సాగుపై ఆశలు పెంచుకున్నారు. ఈ ధర మరికొంత పెరుగుతుందేమోనని కొందరు రైతులు కోల్డ్ స్టోరేజీల్లో భద్రపర్చుకున్నారు. ఇప్పుడు ధరలు దారుణంగా తగ్గడంతో నెత్తీనోరూ బాదుకుంటున్నారు. గత సీజన్ వరకు మిర్చి ధర రూ.21వేలకు పైగా పలికింది. అయితే.. సడెన్‌గా రూ.13 వేలకు పడిపోవడం రైతులకు షాకిచ్చింది. అంతేకాదు.. క్వాలిటీ లేదంటూ కొన్ని చోట్ల తొలి కోత కాయ కూడా రూ.10 వేలు నుంచి రూ.12 వేలకే అడుగుతున్నారు. దాంతో, మహమ్మారి తెగుళ్ల నుంచి పంటను కాపాడుకున్న మిర్చి రైతులు లబోదిబోమంటన్నారు. ధర పతనంతో ఆందోళనలకు దిగారు.
ఈ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌ను సందర్శించడం కాక రేపింది. మిర్చి రైతులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మాజీ సీఎం జగన్. ఎకరాకు సుమారుగా రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు రైతులు. స్థానికంగా కూలీల కొరత ఏర్పడటంతో ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో కూలీలను తెప్పించుకొని మరీ మిర్చి పంటలు కోశారు. మిర్చి తోటల వద్ద కూలీలకు అన్ని సౌకర్యాలూ కల్పించారు. ఇలా మిర్చి కోతలకే ఎకరానికి సుమారు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. కానీ.. ఇంతలా శ్రమించి మిర్చిని కోసి మార్కెట్‌కు తీసుకెళ్తే ధరలు మాత్రం దారుణంగా పతనమై కన్పిస్తున్నాయి. నాణ్యతను బట్టి బహిరంగ మార్కెట్లో క్వింటా మిర్చి ధర రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు మాత్రమే పలుకుతోంది. దీంతో మిర్చి రైతుకు కంటతడి తప్ప మరేమీ లేకుండా పోతోంది.
మరుసటి ఏడాది వరకూ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుదామంటే ఇప్పుడు పెట్టుబడులు పూడే మార్గం కన్పించడం లేదు. పైగా గత యేడాది అనుభవం దృష్ట్యా అప్పటి ధర ఎలా ఉంటుందోనన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. దీంతో, కొందరు రైతులు ఇదే ధరలకు తెగనమ్ముకుంటుండగా.. మరికొందరు రైతులు మాత్రం తమ పంటను కల్లాల్లోనే నిల్వ ఉంచుకొని ధరల పెరుగుదల కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలోనే మిర్చి రైతుల కష్టాలు స్వయంగా పరిశీలించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా.. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.13వేల ధరతో మిరప రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే పంటలకు మద్దతు ధరలు కల్పించాలని.. లేకుంటే రైతుల తరపున పోరాటాలకు దిగుతామని జగన్ హెచ్చరించారు.
ఇక.. రైతుల ఆందోళనలు, వైఎస్ జగన్ మిర్చియార్డు సందర్శనతో మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. ధరల స్థిరీకరణ నిధి కింద రేటు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా ఏపీలో మిర్చి పంటలు దెబ్బతిన్నాయని.. మిర్చి రైతుల సమస్యను ప్రత్యేక కేసుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే.. ఢిల్లీ పర్యటనలో మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.