ముఖ్యమైన పండగలు–పర్వదినాలు…
- 03, సోమవారం, పుత్ర గణపతి వ్రతం
- 04, మంగళవారం, శ్రీకంఠ జయంతి
మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలను నేర్పుగా అధిగమిస్తారు. సేవ, ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారిస్తారు. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఒక ప్రకటన ఉపయుక్తంగా మారుతుంది. పలుకుబడి కలిగిన వారు ఊహించని రీతిలో మీకు సహకరిస్తారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు లభిస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకున్న డబ్బు లభించి అవసరాలకు ఉపయోగపడుతుంది. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు సమకూర్చుకుంటారు. వ్యాపారాలు కొన్ని కొత్తగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తారు. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుని ముందుకు సాగుతారు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు తమ అనుభవాలతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. 7,8వ తేదీలో వివాదాలు. మానసిక అశాంతి. కీలక నిర్ణయాలు. దూరప్రయాణాలు. శ్రీ ఆదిత్య హృదయం పఠించండి.
వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
సన్నిహితులతో విభేదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఎదుటవారిని నొప్పించకుండా మీ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత దగ్గరై సహకరిస్తారు. పదిమందిలోనూ మీ ఆధిపత్యాన్ని చూపుతారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు క్రమేపీ తొలగి అవసరాలు తీరతాయి. ప్రముఖులు ఇచ్చే సలహాలు ఉపకరిస్తాయి. భూముల వివాదాలు క్లిష్టతరమైనా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య గడుపుతారు. కొన్ని ఆరోగ్య సమస్యలతో కుస్తీపట్టినా ఉపశమనం లభిస్తుంది. ఇంటి నిర్మాణంలో కొన్ని అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపారాలలో నైపుణ్యతతో చేజారిన లాభాలు సైతం దక్కించుకుంటారు. ఉద్యోగాలలో ఎటువంటి వి«ధులు అప్పగించినా వెనుకడుగు వేయరు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు మంచి గుర్తింపు పొందుతారు. 5,6 తేదీల్లో చర్చలలో విఘాతం, ధనవ్యయం. నిర్ణయాలు మార్చుకుంటారు. శ్రీ దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు).
పరిచయాలు విస్తృతమై కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆసక్తికరమైన సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. దూరమైన ఆప్తులు దగ్గరై సాయం అందించి ఆప్యాయతను చాటుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఇబ్బందులు అధిగమించి అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొన్ని కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. మీలో భక్తిభావాలు పెరిగి ఆధ్యాత్మిక కేంద్రాలు సందర్శిస్తారు. ఓర్పు, సహనం మీ ప్రగతికి బాటలు వేస్తాయి. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తారు. వ్యాపారాలలో ప్రతిష్ఠంభన తొలగి ముందుకు సాగుతారు. కొత్త సంస్థలను ప్రారంభిస్తారు. ఉద్యోగులకు విధులు మరింత సులభతరం కానున్నాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులు ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది.6,7 తేదీలలో మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి.కనకధారా స్తోత్రాలు పఠిస్తే మేలు.
కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష).
ఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయమై ఉత్సాహంతో గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు, సమస్యలు తొలగుతాయి. ఏ కార్యక్రమాన్నైనా నేర్పుగా పూర్తి చేసి పనితీరుని నిరూపించుకుంటారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సమాజంలో మీ సేవలు విస్తృతమవుతాయి. కొన్ని శుభకార్యాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురై ఆలోచనలో పడతారు. నిరుద్యోగులకు తలచుకున్న ఉద్యోగాలు లభించవచ్చు. రావలసిన డబ్బు అందుకోవడంతో పాటు, మీ బాకీలు సైతం తీర్చే సమర్థత కలిగి ఉంటారు. కుటుంబసభ్యులు మీపై మరింత ప్రేమ చూపుతారు. ఆరోగ్యం సహకరించకున్నా వ్యవహారాలలో వెనుకడుగు వేయరు. వ్యాపారాలలో అనుకున్న లాభాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఉద్యోగాలలో మీ కృషికి తగిన ఫలితం కనిపిస్తుంది. విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు గతం కంటే మరింత ప్రోత్సాహకరమైన పరిస్థితుల మధ్య గడుపుతారు. 2,3 తేదీల్లో బంధువుల నుండి ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఒప్పందాలు వాయిదా. శివారాధన మీకు అన్ని విధాలా అనుకూలిస్తుంది.
సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఎంతోకాలంగా పెండింగ్లో పడుతూ వస్తున్న కార్యక్రమాలు పూర్తయ్యే సమయం. ఎటువంటి రాజీపడకుండా ముందుకు సాగితే విజయం మీదే. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల ద్వారా కొంత లాభపడతారు. ఆదాయానికి లోటు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఖర్చులు సైతం అదుపు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు వస్తాయి. అందరిలోనూ మీపై ప్రేమాభిమానాలు పొందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ భక్తిభావం కలిగి ఉంటారు. ప్రముఖుల పరిచయం మీలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో ఊహించని ఒప్పందాలు. ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో తగినంత లాభాలు దక్కి కొత్త వ్యాపారాలు సైతం ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు తీరతాయి. క్రీడాకారులు, కళాకారులకు విజయపథంలో సాగుతారు. వీరికి ఎదురులేని పరిస్థితి ఉంటుంది. 4,5 తేదీల్లో మిత్రులతో కలహాలు. కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. గాయత్రీ ధ్యానం చేయండి.
కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
పలుకుబడి కలిగిన వారి పరిచయాలు మీకు ఉపకరిస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగి కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కొన్ని వివాదాల నుండి ఎట్టకేలకు బయటపడతారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. విరివిగా తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థుల చిరకాల కోరిక నెరవేరుతుంది. వాహనాలు, ఖరీదైన వస్తువులు కొంటారు. డబ్బుకు లోటులేకుండా గడిపేస్తారు. అనూహ్యంగా కొంత మొత్తం అందుతుంది. కుటుంబంలో అందరితోనూ సంతోషంగా గడుపుతారు. ఎంతటి బాధ్యతనైనా పట్టుదలతో పూర్తి చేసి మీ సత్తాను నిరూపించుకుంటారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు ఆశించినంతగా సమకూర్చుకోవడంలో సఫలవుతారు. ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగించి మంచి పేరు గడిస్తారు. వైద్యులు, కళాకారులకు ఊహించనంత ప్రోత్సాహం. 5,6 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ధనవ్యయం. శ్రీ గురుదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కొన్ని ఆలోచనలు ఎట్టకేలకు అమలు చేస్తారు. ఆత్మీయులు మీ సలహాల నిమిత్తం సంప్రదిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు కూడా మీపట్ల ద్వేషభావం విడనాడడం శుభపరిణామం. స్థిరాస్తులు కొనుగోలు చేయడంలో ఆకంకాలు తొలగుతాయి. చేతినిండా సొమ్ము సమకూరి మరింత ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో మీ అభిప్రాయాలను అంతా గౌరవిస్తారు. ఆరోగ్యపరంగా తీసుకున్న జాగ్రత్తలు మీకు ఉపశమనం ఇస్తాయి. వ్యాపారాల విస్తృతికి చేసే ప్రయత్నాలు సఫలమై ఊరట చెందుతారు. ఉద్యోగాలలో ఎంతటి బాధ్యతనైనా ఎవరి సాయం లేకుండా నెరవేరుస్తారు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు అనూహ్యమైన రీతిలో అవకాశాలు సాధిస్తారు.7,8 తేదీల్లో వృథా వ్యయం. మనశ్శాంతి లోపం. కొన్ని నిర్ణయాలు వాయిదా. శివపంచాక్షరి పఠించడం ఉత్తమం.
వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
చాకచక్యం, నేర్పుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలు చక్కబెడతారు. మీ యుక్తికి కొందరు వ్యతిరేకులు కూడా కంగుతింటారు. ఆదాయపరంగా నెలకొన్న ఇబ్బందులు అధిగమించి సొమ్ము సమకూర్చుకుంటారు. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. కుటుంబ బాధ్యతల నిర్వహణలో విజయం సాధిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. ఒక వ్యక్తి ద్వారా ఊహించని రీతిలో సహకారం అందవచ్చు. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగడమే కాకుండా కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాలలో ఎదుటవారి కంటే మెరుగైన పనితీరు ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు విశేష గుర్తింపు అందుకుంటారు. 3,4 తేదీల్లో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. కావలసిన వారితో విభేదాలు. శ్రీ కాలభైరవాష్టకం పఠించండి.
ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమై ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. మీ ఖ్యాతి మరింత పెరిగి అందరూ ఆశ్చర్యపడతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడేందుకు యత్నిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా కొనసాగుతాయి. ఆదాయం మరింత సమకూరి అవసరాలు తీరతాయి. వేడుకలు, ఉత్సవాలలో పాల్గొంటారు. కుటుంబంలో మీపై ప్రేమ పెరుగుతుంది. ఇంతకాలం విమర్శించిన వారు కూడా ప్రశంసిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి ఊరట లభిస్తుంది. విద్యార్థులు కోరుకున్న కోర్సులు దక్కించుకునే అవకాశాలున్నాయి. వ్యాపారాలలో వ్యూహాలకు పదునుపెట్టి పోటీదారులను ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు అధిరోహించే వీలుంది. కళాకారులు, క్రీడాకారులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. 3,4 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు, సమస్యలు. కొన్ని వివాదాలు నెలకొని ఇబ్బందిపడతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
చేపట్టిన కార్యక్రమాలను ఎటువంటి జాప్యం లేకుండా సజావుగా పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆలోచనలను కార్యరూపంలో పెట్టడంలో విజయం సాధిస్తారు. ఊహించని ఆహ్వానాలతో ఆశ్చర్యపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. రావలసిన సొమ్ము అందుకుని ఖర్చులు అధిగమిస్తారు. కుటుంబంలో మీ బాధ్యతలను సమర్థనీయంగా నెరవేరుస్తారు. సోదరుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు కుదురుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వీరు వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలలో ఆశించినంతగా అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో విశేష ప్రగతి కనిపిస్తుంది, మంచి గుర్తింపు లభిస్తుంది. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు సంతోషకరమైన సమాచారం రావచ్చు. 5,6 తేదీలలో ముఖ్య ఒప్పందాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మానసిక అశాంతి. శ్రీ ఆంజనేయ దండకం పఠించండి.
కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కుటుంబసభ్యుల వైఖరి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఎంత కష్టించినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక నిరాశ చెందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో మీ శక్తి చాలదు. దేవాలయాలు, వివిధ ఆశ్రమాలు సందర్శిస్తారు. సకాలంలో డబ్బు అందక అవసరాల నిమిత్తం ఇబ్బందిపడతారు. కుటుంబంలోని అందరూ మీపై వ్యతిరేకత చూపుతారు. సహనం, ఓర్పుతో ముందుకు సాగండి. ఎటువంటి నిర్ణయాలు ప్రస్తుతం తీసుకోకుండా వాయిదా వేయడం ఉత్తమం. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి, ఆహార నియమాలు పాటించండి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి. ఉద్యోగాలలో వి«ధులు నిర్వర్తించడంలో అప్రమత్తత అవసరం. పారిశ్రామిక, రాజకీయవేత్తల యత్నాలు ముందుకు సాగవు. 4,5 తేదీల్లో శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆహ్వానాలు అందుకుంటారు. రుద్రాభిషేకం చేయించుకుంటే ఉత్తమం.
మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి).
సహనం, నేర్పరితనం ఆయుధాలుగా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడంలో సఫలమవుతారు. శత్రువులను కూడా ఆకట్టుకుంటూ ముందుకు సాగుతారు. రాబడి విషయంలో స్తబ్ధత తొలగి సకాలంలో సొమ్ము సమకూరుతుంది. కుటుంబంలో ఒత్తిడులు, వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. దైవకార్యాలు చేపడుతూ, ఆ దిశగా అడుగులు వేస్తారు. భూముల వ్యవహారాలలో సోదరులతో ఒక అంగీకారానికి వస్తారు. శుభకార్యాల నిర్వహణపై ఒక అభిప్రాయానికి వస్తారు. ముఖ్య సమావేశాలకు హాజరై మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. దూరపు బంధువులు కలసి శుభవార్తలు అందిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాల కోసం యత్నిస్తారు. రాజకీయవేత్తలు, పరిశోధకులకు అన్నీ విజయాలే. 7,8 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. వివాదాలకు దూరంగా ఉండండి. కీలక నిర్ణయాలలో మార్పులు. సుందరకాండ పారాయణ చేయడం మంచిది.
––––––––––––––––––––––––––––––––––––––––––––