కూతురిని ప్రేమించాడని ఓ యువకుడిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో జరిగింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో యువతి తండ్రి వీరి ప్రేమకు అడ్డుచెప్పాడు. ఇక నుంచి తమ కుమార్తెతో మాట్లాడవద్దని సాయికుమార్‌కు యువతి తండ్రి హెచ్చరిక కూడా చేశారు. సాయికుమార్ కు వార్నింగ్ ఇచ్చినా తన కుమార్తె అతను కలసిమెలసి తిరగడం, తరచు మాట్లాడుకోవడం చేస్తుండటంతో ఆగ్రహంతో రగిలిపోయిన యువతి తండ్రి ఎలాగైనా సాయికుమార్ ను మట్టపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి పది గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో కూర్చని మాట్లాడుతుండగా యువతి తండ్రి గొడ్డలి తీసుకువచ్చి సాయికుమార్‌పై విచక్షణా రహితంగా దాడి చెయ్యడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటీన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా సాయికుమార్ మృతి చెందాడు. అయితే నిన్న గురువారం సాయికుమార్ జన్మదినం కూడా కావడంతో పుట్టినరోజునాడే తమ కుమారుడు హత్యకు గురవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.