ప్రజల సమస్యలపై స్పందించి పోలీసులు నిష్పక్షపాతంగా సేవలందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఏకపక్షంగా వ్యవహరించిన వారు ఎంతటివారైనా చర్యలకు వెనుకాడబోమని ఆమె స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థ పటిష్టం చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. జైలులో ఖైదీలకు కనీస సదుపాయాలు కల్పించడం సహా అక్కడ వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం కోసం విజయవాడ గాంధీనగర్ లోని జైలుకు సోమవారం ఆకస్మిక తనిఖీకి వెళ్లినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. జైలు రికార్డులు, ఖైదీలను ఉంచిన జైళ్లు, ఖైదీలకు, అధికారులకు కావలసిన వసతులపై తనిఖీ నిర్వహించారు. ఇటీవల బోరుగడ్డ అనిల్ కేసులో జైలు అధికారులపై పలు ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ అధికారులపై విచారణ జరుగుతోందన్నారు. మరో రెండు రోజుల్లో నివేదిక రాగానే ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం జైలు అధికారులపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి తెలిపారు.
వైఎస్ఆర్సీపీవి డైవర్షన్ పాలిటిక్స్.. విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేస్తాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత పాలనలో చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వచ్చిన తిప్పలలో భాగంగానే చంద్రబాబునాయుడు, లోకేష్ లక్ష్యంగా వైసీపీ నాయకులు విచక్షణ మరచి విమర్శిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతారాహిత్యంగా కుసంస్కారంతో విమర్శిస్తున్న విజయసాయిరెడ్డిపై కేసులు పెడతామని హోంమంత్రి స్పష్టం చేశారు. కాకినాడ సెజ్, పోర్టు యాజమాన్యాన్ని బెదిరించి వాటాలు లాక్కున్న విజయసాయిరెడ్డిని, వైవీ సుబ్బారెడ్డి అల్లుడిని వదిలే ప్రసక్తి లేదన్నారు. ఎలాగైనా కూటమి ప్రభుత్వాన్ని చీల్చేందుకు వైఎస్ఆర్సీపీ విఫలయత్నం చేస్తోందన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదన్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజల సొమ్మును దోచుకున్న ఏ ఒక్కరినీ వదలమని హోంమంత్రి హెచ్చరించారు. పీకల మీద కత్తిపెట్టి ఆస్తులు రాయించుకోవడం, ప్రశ్నిస్తే కక్షగట్టి దాడులకు దిగిన ఘటనలు చరిత్రలో గత ప్రభుత్వంలో మాత్రమే జరిగాయన్నారు. కాకినాడ పోర్టు కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు గత ఐదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా సంపదను కొల్లగొట్టి పోలీసులు సహా అధికారులను జగన్ అండ్ కో భయపెట్టడం జరిగిందన్నారు.