హాజరైన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, ఎంపీ పురంధేశ్వరి
హోళీ పండుగ భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను ఇనుమడింప చేస్తుందని కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. హోలీ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విజయవాడలోని ఆయన నివాసంలో నిర్వహించిన హోలీ మిలన్ కార్యక్రమంలో అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొని హోలీ ఆడారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు పార్లమెంట్ సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా జీవీఎల్ నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పురంధేశ్వరి మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో హోలీ పేరుతో జరుపుకునే పండుగను మనం శ్రీరామనవమికి ముందు వచ్చే వసంతోత్సవంగా నిర్వహించుకుంటామన్నారు. హోలీ అంటేనే అంతా కలసి ఉండాలనే సందేశమని, నేతలందరూ కూడా ఇదే మార్గంలో వెళ్లాలని పురంధేశ్వరి సూచించారు. కులమతాలకు అతీతంగా, వర్గ వైషమ్యాలు లేకుండా జరుపుకునే ఖర్చులేని పండుగా హోలీ అని ఈపండుగ ఇతర ప్రాంతాల పండుగ అని అనకోకూడదని హోలీ మిలన్ కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శీతాకాలం నుంచి వసంత కాలానికి మారే రోజుల్లో జరుపుకునే పండుగా హోళీ అని జీవీఎల్ తెలిపారు. ఇది హిందువుల పండుగే అయినా అన్ని మాతాల వారు జరుపుకుంటారని చెప్పారు. జీవీఎల్ నిర్వహించిన హోలీ మిలన్ కార్యక్రమంలో వీరితో పాటు బీజేపీ శాసనసభ్యుడు ఎన్.ఈశ్వరరావు. బీజేపీ సంఘటనా మంత్రి మధుకర్, మీడియా ఇన్‌ఛార్జ్ పాతూరి నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు చిరువోలు బుచ్చిరాజు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.