రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. కొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో మండుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించింది. అకస్మాత్తుగా మధ్యాహ్నం వేళ వాతావరణం మారి.. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో పలు చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. పదర మండలం కోడోని పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు. పొలంలో కూలీ పనులకు వెళ్లిన సమయంలో పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు పొలంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను సుంకరి సైదమ్మ, ఈదమ్మగా పోలీసులు గుర్తించారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మకు తీవ్రగాయాలు కాగా.. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మరి కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్ గఢ్, నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కి.మీల ఎత్తులో చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది. మధ్య మహారాష్ట్ర నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు బలహీనపడింది. ఈ కారణంతోనే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వివరించారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ :
ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజమాబాద్ కామారెడ్డి జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడి వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ఆదేశం :
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని ఆరు జోన్‌లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎర్రమంజిల్ ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఆర్ఎఫ్ ,జీహెచ్ఎంసీ ఐఆర్‌టీ టీమ్స్ వాటిని క్లియర్ చేస్తుందని పేర్కొన్నారు. సెక్రటేరియట్ , రాజ్ భవన్ రోడ్, మసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు వెంట వెంటనే నీటిని తొలగించాలని ఆదేశించారు. ప్రధాన రోడ్లపై వరద ప్రభావం వల్ల రోడ్లపై ట్రాఫిక్ ఏర్పడిందని అరగంట లోపు వాటర్ క్లియర్ చేస్తామని అధికారులు తెలిపారు. డ్రైనేజీ పొంగి పొర్లకుండా జెట్టింగ్ మిషన్స్ ద్వారా అరికడుతున్నారు. పోలీస్, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, విద్యుత్ అధికారులు సమన్వయం చేసుకొని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.