ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో జరుగుతున్న మహాకుంభమేళా చారిత్రక ప్రాధాన్యాన్ని సొంతం చేసుకుంది. ప్రతీ పన్నెండేళ్లకోసారి జరిగే కుంభమేళా, ఆ కుంభమేళాలో భాగంగా పలకరించే మౌని అమావాస్యను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. కుంభమేళాకు లక్షలు, కోట్ల సంఖ్యలో జనం తరలి వస్తుండగా.. మౌని అమావాస్య ఘడియల్లో ఆ భక్తజన ప్రవాహం మరింతగా పెరుగుతోంది. ఇవాళ మౌని అమావాస్య కావడంతో తెల్లవారు జామునుంచే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు మొదలయ్యాయి. అయితే, భక్తులు అశేషంగా తరలి రావడంతో తోపులాట కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సంఘటనలో పలువురు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. గాయపడ్డవాళ్లకు కేంద్ర ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
అయితే, ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా ప్రాశస్త్యం గురించి తెలిసిన వాళ్లకు, ఆ కుంభమేళాను ఫాలో అవుతున్న వాళ్లకు సరిగ్గా ఏడు దశాబ్దాల క్రితం అక్కడ జరిగిన తొక్కిసలాట కూడా గుర్తుకొస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత జరిగిన తొలి కుంభమేళాలో అధికారికంగానే 800 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అప్పట్లో ఈ స్థాయిలో సమాచార సాధనాలు లేకపోవడంతో మరణాలు మొత్తం ప్రభుత్వం నివేదించలేదని, మృతుల సంఖ్య 2000 మందికి పైగానే ఉంటుందని పలు నివేదికలు చెప్పాయి.
మహా కుంభమేళా సమయంలో వచ్చే మౌని అమావాస్య రోజు త్రివేణీ సంగమంలో స్నానమాచరించేందుకు సాధువులు, భక్తులు భారీగా తరలిరావడం ఆనవాయితీ. ఇదే రోజు అఘోరాలు, నాగ సాధవులు కూడా లెక్కలేనంత మంది పెద్ద సంఖ్యలో గుంపులుగా వచ్చి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రముఖులు కూడా మౌని అమావాస్య రోజు ప్రయాగ్‌రాజ్‌లో స్నానమాచరించాలని ఉవ్విళ్లూరతారు. ఆ క్రమంలో మౌని అమావాస్య నాడు సాధువులు, భక్తులతో పాటు.. ప్రముఖులు కూడా కుంభమేళాకు పోటెత్తుతారు.
మౌని అమావాస్య ప్రాశస్త్యం :
మౌని అమావాస్య ప్రతియేటా వస్తుంది. ఆ రోజు ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో స్నానమాచరించడం మంచిదని అందరూ చెబుతారు. ఇక, మహా కుంభమేళాలో వచ్చే మౌని అమావాస్యకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా 144 యేళ్ల తర్వాత వస్తున్న అత్యంత శుభప్రదమైన ఘడియ అని పండితులు చెబుతుండటం ఈ ప్రాధాన్యతను మరింత పెంచుతోంది. ఈ రోజు ప్రయాగ్‌రాజ్‌లో స్నానమాచరిస్తే ఊహకందని ఫలితం ఉంటుందని కూడా ప్రస్తావిస్తున్నారు.
ఏడు దశాబ్దాల క్రితం ఘోర విషాదం :
అయితే, ఇదే సమయంలో సరిగ్గా 70 సంవత్సరాల క్రితం 1954లో జరిగిన ఘోర విషాదాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు జరిగిన తొక్కిసలాట.. ఆ తర్వాత కూడా కుంభమేళాల్లో జరిగిన తొక్కిసలాట సంఘటనలను ప్రస్తావిస్తున్నారు.
స్వాతంత్ర్యం వచ్చాక మొదటి కుంభమేళా :
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి కుంభమేళా 1954లో జరిగింది. ఆ యేడు.. ఫిబ్రవరి 3వతేదీ మౌని అమావాస్య వచ్చింది. మౌని అమావాస్య ప్రాశస్త్యం గురించి తెలిసిన వాళ్లందరూ పవిత్ర స్నానాలకు పోటెత్తారు. పైగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న సంతోషంతో అశేష జనం తరలివచ్చారు. అసంఖ్యాకంగా భక్తులు, నాగ సాధువులు, అఘోరాలు పోటెత్తారు. లక్షల సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌ను ముంచెత్తారు. అయితే, ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో అధికారికంగా 800 మంది చనిపోయారు. 2 వేలకు మంది పైనే గాయపడ్డారని అధికారికంగా ప్రకటించారు. కానీ, అనధికార లెక్కల ప్రకారం ఆరోజు జరిగిన తొక్కిసలాటలో 2వేల మందికి పైగానే చనిపోయారని అప్పుడే కొన్ని పత్రికల్లో వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి.
జన సంఘటిత వేదిక :
దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఈ మహా కుంభమేళాను స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు, సంఘసంస్కర్తలు ప్రజలను సంఘటితం చేసే వేదికగా ఉపయోగించుకున్నారు. దేశమంతటినుంచీ జనం తరలి వచ్చే ఉత్సవం కావడంతో దేశం నలుమూలలకూ స్వాతంత్ర్య ఉద్యమ నినాదాలు, వ్యూహాలు పంపించడానికి సందర్భంగా వాడుకున్నారు. దీంతో, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి కుంభమేళాకు 50లక్షల మంది తరలివచ్చినట్లు అప్పటి నివేదికలు వెల్లడించాయి. అదే సమయంలో అప్పటి రాజకీయ నాయకులు కూడా కుంభమేళాలో పవిత్ర స్నానాలకోసం తరలివచ్చారు. దీంతో, ప్రముఖులు, రాజకీయ నాయకులకోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన రోడ్లు బ్లాక్ చేశారు. దీంతో, స్నానాలాచరించేందుకు వచ్చిన భక్తులు వెళ్లేందుకు సరిపడా దారులు లేక, ప్రదేశం లేక తొక్కిసలాట చోటు చేసుకుంది.
1954 మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటతో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటుచేసింది. జస్టిస్ కమలాకాంత్‌వర్మ నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిషన్ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.