ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ ప్రస్తావిస్తోన్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుల అనుసంధానానికి రూ. 81,900 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం లెక్కలు తేల్చాయి. అయితే ఈ ప్రాజెక్టు భారం రాష్ట్ర ఖజానాపై పడకుండా “ఆపరేషన్ మోడల్”లో పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. అన్ని అవకాశాలను పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అవసరమైన విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు ద్వారా ఉత్పత్తి చేసి భారం తగ్గించవచ్చని చెప్పారు.
సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుల అనుసంధానానికి సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు – డీపీఆర్ ఈ ఏడాది జూన్ 20 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అక్టోబర్ 20 నాటికి సీడబ్ల్యూసీ ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణ అనుమతులు త్వరగా తీసుకుని పనులు వేగంగా ప్రారంభించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ప్రాజెక్టు వివరాలు :
పోలవరం-బనకచర్ల అనుసంధానం పూర్తిచేయడానికి రూ.81,900 కోట్లు అవసరం అవుతుంది. ఈ అనుసంధానం ద్వారా రోజుకు 2 టీఎంసీలు నీరు వినియోగించుకునే వీలుంటుంది. 368.60 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని తరలిస్తారు. మెయిన్ టన్నెల్ పొడవు 20.50 కిలోమీటర్లు కాగా, సిద్ధాపురం ట్విన్ టన్నెల్స్ 6.60 కిలోమీటర్లు, పైపులైన్ 17 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 9 లిఫ్ట్‌లు ఏర్పాటుచేస్తారు. ఈ ప్రక్రియకు 3,377 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది.
ప్రాజెక్టును పూర్తిచేయడానికి మొత్తం 54,000 ఎకరాలు అవసరం. అందులో 15,300 ఎకరాలు అటవీ భూమి సేకరించాల్సి ఉంటుంది. బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం 5 గ్రామాల్లోని 18 నివాస ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది.
అనుసంధాన ప్రక్రియ – 3 సెగ్మెంట్ల వివరాలు :
1. సెగ్మెంట్ 1 :
- పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ దిగువన పవిత్ర సంగమం వరకు తాడిపూడి వరద కాలువ ద్వారా 175 కిలోమీటర్ల దూరం నీటిని తరలిస్తారు.
- రోజుకు 18,000 క్యూసెక్కుల నీటితో 1,401 ఎకరాల భూమి అవసరమవుతుంది.
- ఈ సెగ్మెంట్ కోసం రూ. 13,800 కోట్లు ఖర్చు అవుతుంది.
2. సెగ్మెంట్ 2 :
- వైకుంఠపురం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు 23,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తారు.
- ఓపెన్ కెనాల్ 83.40 కిలోమీటర్లు, పైపులైన్ 12.05 కిలోమీటర్లు, 6 లిఫ్ట్‌లు నిర్మిస్తారు.
- ఈ సెగ్మెంట్ కోసం 2,493 మెగావాట్ల విద్యుత్ వినియోగించి, 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.
- బొల్లాపల్లి రిజర్వాయర్‌లో 152 టీఎంసీల లైవ్ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది.
- ఖర్చు: రూ. 35,750 కోట్లు.
3. సెగ్మెంట్ 3 :
- బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు 23,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తారు.
- ఓపెన్ కెనాల్ 109.80 కిలోమీటర్లు, పైపులైన్ 5.7 కిలోమీటర్లు, మెయిన్ టన్నెల్, సిద్ధాపురం ట్విన్ టన్నెల్స్ నిర్మిస్తారు.
- ఖర్చు: రూ. 32,350 కోట్లు.
ప్రాజెక్టు ప్రయోజనాలు :
- పోలవరం-బనకచర్ల అనుసంధానం పూర్తయితే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు విస్తృతంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.
- మొత్తం 12.4 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది.
- కాలువ ప్రవహించే సుమారు 400 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు తాగునీటి సమస్య తీరుతుంది.
- భూగర్భ జలాల మట్టపు నీటిమట్టం పెరుగుతుంది.
- 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
- బొల్లాపల్లి రిజర్వాయర్‌లో మత్స్య సంపద పెరుగుతుంది.
- ప్రాజెక్టు ద్వారా ఏడాదికి సుమారు రూ. 12,294 కోట్ల విలువైన సంపద సృష్టి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.