ఖరీఫ్ ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో మొదటిగా ఏలూరు జిల్లాలో ప్రారంభమై అదే దిశగా కొనుగోళ్లలో జిల్లా అధికారులు చూపిన చొరవను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్ చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. గురువారం ఏలూరు విచ్ఛేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం సేకరణపై మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో రూ. 733.91 కోట్ల విలువైన 49,022 మంది రైతుల నుంచి 3,58,924 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం భేషుగ్గా ఉందన్నారు. సంబంధిత రైతులకు సొమ్ముకూడా చెల్లింపు చేయడం అభినందనీయమన్నారు. పౌర సరఫరాల రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించినప్పటికీ దానికి మిన్నగా ధాన్యం కొనుగోలు చేయడం పట్ల జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి లను మంత్రి అభినందించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి నేతృత్వంలో పౌర సరఫరాల అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేశారన్నారు. వీరందరిని మంత్రి నాదెండ్ల మనోహార్ ప్రత్యేకంగా అభిందించారు. నాలుగు సంవత్సరాల అనంతరం రైతులు నిజమైన సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చాలా సమర్ధవంతంగా, పటిష్టవంతంగా జరిగిందన్నారు. ఏలూరు జిల్లాలో సుమారు మరో 10 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని తప్పకుండా ప్రతిధాన్యం గింజ ప్రభుత్వం కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి లను అభినందించారు.