26.7 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

గోదారోళ్ళ కోడే గెలిచింది…

  • ఉభయ గోదావరి జిల్లాల్లో కోట్లు దాటిన కోడి పందాలు
  • పలువురు ప్రముఖులు, సెలైబ్రిటీలు, ఎమ్మెల్యే, ఎంపీలు హాజరు

సంక్రాంతి బరిలో ఎప్పటిలాగే కోడి మళ్ళీ గెలిచింది. పోలీసుల తాటాకు చప్పుళ్లకు కోడి బెదరలేదు. ఆదరలేదు. కోట్ల రూపాయలు చేతులు మారాయి. దురదృష్టం ఏమిటంటే అధికార పార్టీ దగ్గరుండి నిర్వహించడం మానవతావాదులకు, జంతు ప్రేమికులకు నచ్చలేదు. చట్టాలు కళ్ళు మూసుకున్నాయి. పోలీసులు చేతులు ముడుచుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు అనుచరులతో కలిసి నవ్వుతూ వచ్చారు.

ఉభయగోదావరి జిల్లాల్లో కోట్లు కట్టలు తెంచుకున్నాయి. అయిదు నిమిషాల్లో రాజు ఎవడో… పేద ఎవడో తెలిసిపోతుంది. అందుకే ఇన్ స్టెంట్ లాభాలు కావాలని అనుకునేవారు ఇక్కడికి వస్తారు. అదృష్టం ఉందా? లేదా? అని తెలుసుకునే వాళ్ళు వస్తారు. ప్రెస్టేజ్ కోసం వచ్చే వాళ్ళు వస్తారు. సరదాగా కోడి పందాలు చూసేందుకు వచ్చే వాళ్ళు వస్తారు.నయనానందం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. సంక్రాంతి అల్లుళ్ళు వస్తారు. ఇలా ఎందరో ఎన్నో భావావేశాలతో కోడి పందాల బరుల దగ్గర తిరుగుతారు.
చివరికి పండగ పూట ఏడ్చేవాళ్ళుంటారు.. నవ్వే వాళ్ళుంటారు.

ఇకపోతే రాష్ట్రం మొత్తమ్మీద కోడిపందాలకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఇక్కడికే ప్రముఖులు, సెలబ్రిటీలు వస్తారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక పందెంలో 1 కోటి 25 లక్షలకు పందెం కాశారు. ఇదే ఈ ఏడాది మేటి పందెంగా చెబుతున్నారు. గుడివాడ ప్రభాకర్ నెమలి పుంజును రాతయ్య తాలూకా రసంగి పుంజును బరిలో దింపారు. గుడివాడ ప్రభాకర్ పుంజు విజయం సాధించింది.

ఇక చిన్నా చితక పందాలతో కలిపి లక్షల్లో కాశారు. పండగ నాలుగు రోజులు ధూమ్ ధామ్ గా సాగిపోయింది. ముక్కనుమ రోజు ఎక్కడా తగ్గేది లేదంటున్నారు.
ఇక కోడిపందాలు చూసేందుకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ల నుంచి పలువురు తరలి వచ్చారు. పలుచోట్ల సినిమా యాక్టర్లు సందడి చేశారు.

సంక్రాంతి కోడిపందాల పేరు చెప్పి నిర్వాహకులు దోపిడీ చేశారు. కారు పార్కింగ్ పేర్లతో తినేశారు. ఇక స్టాల్స్ పేర్లతో మింగేశారు. ఇక లోపల ఇష్టం వచ్చిన రీతిలో తిను బండారాలు విక్రయించారు. బరుల దగ్గర మద్యం ఏరులై పారింది. ప్రభుత్వాలు దగ్గరుండి నడపడంతో
పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. మొత్తానికి ప్రతి ఏడాదిలాగే ఈసారి బరుల ఏర్పాటుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మురముళ్ల లాంటి చోట్ల కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

ఒకప్పుడు సరదాగా సాగిన కోడిపందాలు నేడు బిజినెస్ గా మారడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com