36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

గిల్ అవుట్.. బుమ్రా డౌట్ ?

ఆస్ట్రేలియాలో టీమిండియా తడబాటు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. టాప్ ఆర్డర్ అంతా వరుసగా విఫలమవడంతో మ్యాచ్ ఏకపక్షంగా మారిపోతోంది. మరోవైపు బౌలర్లలో బుమ్రా తప్ప ఎవరూ రాణించలేకపోవడం టీమ్ ఇండియాను కలవరపరుస్తోంది.

ఇక భావి భారత క్రికెట్ ఆశాకిరణంగా భావించే గిల్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోవడం లేదు. అతనికి వరుసగా అవకాశాలిస్తున్నా, సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26 -31 వరకు మెల్ బోర్న్ లో జరిగే నాలుగో టెస్టుకి అతన్ని తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

గిల్ ప్లేస్ లో సర్ఫరాజ్ ఖాన్ లేదా ధృవ్ జురెల్ గానీ ఆడే అవకాశాలున్నాయి. ఒకవేళ ధృవ్ కి అవకాశం వస్తే, అప్పుడు ముగ్గురు వికెట్ కీపర్లు జట్టులో ఉన్నట్టుంటుంది. ఎందుకంటే ఇప్పటికే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ధృవ్ కూడా తోడవుతాడు. అందువల్ల సర్ఫరాజ్ కి అవకాశం దొరుకుతుందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు టీమ్ ఇండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై మొత్తం ఒత్తిడి పడిపోతోంది. ఒక్కడే భారమంతా మోస్తున్నాడు. తను కానీ వికెట్ తీయకపోతే, ఆరోజు మ్యాచ్ మీద ఆశ వదిలేసుకోవడమే అన్నట్టుగా ఉంది. మిగిలిన వారెవరూ కూడా తమ స్థాయికి తగినట్టు ఆడటం లేదు. స్పిన్నర్లు రాణించలేకపోతున్నారు. అయితే సిరాజ్ కష్టపడుతున్నాడు కానీ, ఎక్కడో లయ తప్పుతోంది.

ఈ నేపథ్యంలో జస్ప్రిత్ బుమ్రాకి నాలుగో టెస్టులో రెస్ట్ ఇస్తారని అంటున్నారు. దీంతో టీమ్ ఇండియా బౌలింగు విభాగంలో మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా ఉంటారు. స్పిన్ విభాగానికి వస్తే అశ్విన్ రిటైర్మెంట్ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ కి అవకాశం వస్తుంది. అలాగే మూడో టెస్టులో బ్యాటింగుతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా ఉండనే ఉన్నాడు.

ఈ రెండు మార్పులతో నాలుగో టెస్టు ఆరంభం కానుందని అంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో టీమ్ ఇండియా 1-1తో సమానంగా ఉంది. మొదటి టెస్టులో అద్భుతంగా ఆడి శుభారంభం చేసి, రెండో టెస్టు ఓడి పీకలమీదకు తెచ్చుకుంది. తర్వాత మూడో టెస్టులో …వరుణుడు కాపాడటంతో బతుకుజీవుడా అని బయటపడింది. దీంతో నాలుగోటెస్టు అత్యంత ఆసక్తికరంగా మారనుంది. ఇది గెలిస్తే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ కి దారులు ఒకవైపున తెరిచి ఉంటాయని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com