29.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

భూములు అమ్మి అమరావతికి నిధులు – మంత్రి నారాయణ

అమరావతి రాజధాని నిర్మాణానికి సేకరించిన భూముల్ని విక్రయించడం ద్వారా నిధులు సమీకరిస్తామని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యల్ని నారాయణ ఖండించారు. మరోవైపు.. అమరావతి రుణాలకు లైన్ క్లియర్ అయ్యింది. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూములలో కొంత మేర అమ్మడం ద్వారా రాజధానిని నిర్మిస్తామని మంత్రి నారాయణ వివరించారు. మరోవైపు.. అమరావతి రుణాల మంజూరులో ఎదురవుతోన్న సాంకేతిక సమస్యలను అధిగమించినట్టు సీఆర్‌డీఏ ప్రకటించింది. రాజధాని అప్పులపై ఆర్థిక సంస్థలు సంతృప్తి చెందినట్టు సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం వేసేది లేదని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణానికి హడ్కో, ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీతో పాటు జర్మనీ బ్యాంకు నుంచి రుణాలు సేకరిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిపై ప్రతిపక్షాల మాటలు వినవద్దని, నమ్మవద్దని ప్రజలకు సూచించారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్‌డ్‌గా ఉండాలని సీఎం భావిస్తున్నారని, అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నమని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో అమరావతికి రూ.6 వేల కోట్లు కేటాయించారని, అవసరమైతే ఇంకా నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు నారాయణ వివరించారు. రాజధాని విషయంలో పారదర్శకంగా ఉంటామని, ఎలాంటి అవకతవకలు ఉండవని మరోసారి స్పష్టం చేశారు. ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం మాత్రమే టెండర్లు పిలిచి నిర్మాణాలు చేస్తున్నామని చెప్పారు. 217 చ.కి.మీ. పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో 5 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు.

రూ.50 వేల కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిలో 1000 నుంచి 1200 ఎకరాల్లో అంతర్జాతీయ యూనివర్సిటీలు, పాఠశాలలు, పలు సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ ఆర్థిక సంస్థలు ఇప్పటికే రుణాలను మంజూరు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. పలు అంతర్జాతీయ సంస్థలతో పాటు హడ్కో కూడా భారీగా రుణాలను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రాజధాని నిర్మాణం, రాజకీయ అభ్యంతరాలపై రుణాలను మంజూరు చేసే సంస్థలకు పలువురు ఫిర్యాదు చేశారు. అమరావతి నిర్మాణంపై రాజకీయంగా ఏకాభిప్రాయం లేదని ఫిర్యాదు చేయడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగింది. డిసెంబర్‌ నాటికి రుణాలకు సంబంధించిన నిధులు విడుదల కావాల్సి ఉండగా అందులో జాప్యం జరిగింది. రుణాల మంజూరులో జరుగుతున్న జాప్యంపై సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబు వివరణ ఇచ్చారు. రుణాల మంజూరుపై వ్యక్తమైన అభ్యంతరాలకు వివరణ ఇచ్చినట్టు స్పష్టం చేశారు. అయా సంస్థల ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారని వివరించారు. రుణాల విడుదలకు సంబంధించిన ప్రక్రియ కొలిక్కి వచ్చిందని బ్యాంకు ఖాతాలు కూడా సిద్ధమైనట్టు తెలిపారు. రుణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేవని కన్నబాబు వివరించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com