ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్టీసీపై భారం పడకుండా, వినూత్నంగా ఎలక్ట్రిక్ బస్సులతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. అంటే.. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనం కలిగేలా, ఆర్టీసీకి కూడా భారం లేకుండా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ప్రణాళికకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే మొదటి దశలో కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసింది. ముఖ్యమైన నగరాలకు బస్సులను నడిపిస్తూ.. దశలవారీగా పథకాన్ని విస్తరించనున్నారు. ఆయా నగరాలు, ప్రాంతాల అవసరాన్ని బట్టి ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించబోతున్నారు. విశాఖపట్నానికి 100 బస్సులు, విజయవాడకు 100 బస్సులు, గుంటూరు, నెల్లూరుకు 100 బస్సుల చొప్పున కేటాయించనున్నారు. అలాగే, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, కడప, అనంతపురం, తిరుపతి, మంగళగిరి నగరాలకు ఒక్కో నగరానికి 50 చొప్పున బస్సులు కొనుగోలు చేయబోతున్నారు.
ఇక, ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాక అన్ని డిపోలలో ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు.. మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తున్నారు. అయితే, ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లాల సరిహద్దుల వరకు మాత్రమే పరిమితం చేయనున్నారని, దీని ద్వారా దుర్వినియోగాన్ని అడ్డుకునే యత్నం చేయవచ్చని చెబుతున్నారు.