– ఏసీబీకి చేరిన గవర్నర్ అనుమతి పత్రం
– రాజకీయంగా ఉత్కంఠ రేపుతున్న పరిణామం
మొత్తానికి గవర్నర్ లెటర్ ఏసీబీకి చేరింది. దీంతో, ఇక వాట్‌నెక్ట్స్? అనే అంశం ఉత్కంఠభరితంగా మారింది. కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం జోరందుకుంది. అయితే, ఏసీబీ ఆయనకు నోటీసులు ఇస్తుందా? విచారణకు పిలుస్తుందా? నేరుగా అరెస్ట్ చేస్తుందా? అన్న అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
తెలంగాణలో అధికార బదలాయింపు జరిగిన తర్వాత.. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారం బయటకు వచ్చింది. అడ్డగోలుగా జరిగిన అవినీతి వ్యవహారం బట్టబయలయ్యింది. అప్పుడు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను విచారించేందుకు ఏసీబీ ప్రయత్నించింది. కానీ, కేటీఆర్ ఆదేశంతోనే అంతా చేశామని ఉన్నతాధికారులు స్పష్టంగా సమాధానం ఇవ్వడంతో ఆ అంశంపై అప్పటినుంచి ఆసక్తి నెలకొం్ది.
ఇక, దాదాపు మూడు నెలల నుంచి గవర్నర్ అనుమతికోసం ఎదురుచూస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతోంది. కేటీఆర్ మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా కావడంతో నేరుగా చర్యలు తీసుకోలేకపోతున్నామని, అందుకే గవర్నర్ అనుమతి కోరామని సర్కారు పెద్దలు చెబుతూ వచ్చారు. అయితే, చివరకు గవర్నర్ న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతించారు. ఆ లేఖ ప్రభుత్వానికి చేరింది. దీంతో, సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధానంగా గవర్నర్ లేఖమీదే ఎక్కువగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి.. గవర్నర్ నుంచి ప్రభుత్వానికి వచ్చిన లేఖలో వివరాలు వెల్లడించారు.కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో.. సీఎస్ ఇవాళ ఏసీబీకి ఆ లేఖను పంపించారు. ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులకు సూచించారు. దీంతో, ఇప్పుడు బంతి ఏసీబీ కోర్టులోకి చేరింది. సాధారణంగా గవర్నర్ అనుమతి రాగానే వెంటనే యాక్షన్‌లోకి దిగుతారని అందరూ అనుకున్నారు.కానీ, ప్రభుత్వం మాత్రం కేబినెట్‌లో చర్చించింది. అధికారులకు మార్గదర్శనం చేసింది. ఏసీబీకి లేఖను పంపించింది. మరి.. ఇప్పుడు ఏసీబీ ఏం చేస్తుందనేది.. ఎంతకాలం వెయిట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంపై కేసులు పెట్టారా, లేదా అనే విషయంపైనా ఇప్పటివరకు స్పష్టత లేదంటున్నారు.ఇప్పుడు ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌పైనా విచారణ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. అయితే, ఇప్పటిదాకా ప్రభుత్వం ఇస్తూ వస్తున్న లీకులను పరిగణనలోకి తీసుకుంటే మళ్లీ ప్రత్యేకంగా సాక్ష్యాల సేకరణ కూడా అవసరం లేదంటున్నారు. ఇప్పటికే ఉన్న ఆధారాలతోనే అరెస్టులు చేయొచ్చంటున్నారు. మరి.. ఏసీబీ ఇప్పుడు ఏం చేయబోతున్నది రాజకీయ పరిణామాలను నిర్దేశించనుంది.