ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి.. ఆయా విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ప్రత్యేకంగా నిధుల సమీకరణ అంశంపై సమావేశమయ్యారు. తక్కువ వడ్డీకి రుణాలు అందించే బ్యాంకులనే పరిగణనలోకి తీసుకునే విధంగా ఆయా బ్యాంకుల ప్రతినిధులతో సంప్రదింపులు చేశారు. ఈ భేటీలో కేఎఫ్‌డబ్లు, ఏఎఫ్‌డీ, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు. వీళ్లందరూ విజయవాడ మెట్రోకు సంబంధించిన ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో ఈ బ్యాంకుల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. విశాఖ పట్నం మెట్రో ప్రాజెక్టుకు రూ.6,100 కోట్లు, విజయవాడ మెట్రో ప్రాజెక్ట్‌కు రూ.5,900 కోట్లు రుణాల రూపంలో సేకరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఇటు అమరావతి మెట్రో, అటు విశాఖ పట్నం మెట్రో రెండు ప్రాజెక్టులనూ వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలోనే ఈ రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో ఐదేళ్ల పాటు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులు అటకెక్కాయి. తిరిగి కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడంతో మెట్రో రైల్ పాత ప్రతిపాదనలకు బూజు దులిపారు. అమరావతి నిర్మాణాలు పునః ప్రారంభం కావడంతో పాటు.. ఈ మెట్రో రైలు ప్రాజెక్టులకు కూడా రుణాలు అందించేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో త్వరలోనే మెట్రో రైలు కారిడార్ల పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టి.. విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్నారు. తక్కువ వడ్డీకి రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న బ్యాంకర్లతో చర్చలు జరిపి.. రుణాలు వీలైనంత తొందరగా విడుదలయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికైతే విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు కేఎఫ్‌డబ్లు, ఏఎఫ్‌డీ, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు దాదాపు రూ.12000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. విశాఖ మెట్రో రైలుకి రూ.6,100 కోట్లు, విజయవాడ మెట్రో రైలుకి రూ.5,900 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా నిర్థారించారు.