30.1 C
Hyderabad
Sunday, July 26, 2026

Live Video

spot_img

ఆధ్యాత్మికత కంటే ఆదాయంపైనే దృష్టి – ఏపీ దేవాదాయ శాఖ తీరు

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖను దేవుడే కాపాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఈ శాఖలో అధికారులు ఆదాయ వనరులపైనే దృష్టి సారిస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల విశాఖపట్నంలోని సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో క్యూలైన్‌లో గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై త్రిసభ్య కమిటీని నియమించినప్పటికీ, ఇదంతా కంటితుడుపు చర్యగానే భక్తులు భావిస్తున్నారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తుల ప్రాణాలు మింగిన బాధ్యతలేని అధికార వ్యవస్థపై ఆగ్రహం పెల్లుబుకుతోంది.

ప్రస్తుతం ఏపీలోని అనేక ముఖ్య ఆలయాల్లో పూర్తి స్థాయి ఈవోలు లేరు. బెజవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం, సింహాచలం వంటి దేవాలయాల్లో రెవెన్యూ అధికారులే ఇంచార్జీలుగా కొనసాగుతున్నారు. టీటీడీకి మాత్రమే ఐఏఎస్ స్థాయి అధికారిని ఈవోగా నియమించడంతో, ఇతర దేవాలయాలకు ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టవుతోందంటున్నారు.

కమిషనర్ పదవిలో ఐఏఎస్ అధికారిని నియమించకుండా, ఇంచార్జి కమిషనర్‌గా అదనపు కమిషనర్‌ రామచంద్ర మోహన్‌ను కొనసాగించడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖలో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తుల నిర్వహణ ఈ అనుభవం లేని ఇంఛార్జిలకు అప్పగించడం పలు భూముల వివాదాలకు దారితీస్తున్నట్లు సమాచారం.

విజయవాడ దుర్గగుడి భూములను తక్కువ ధరకే 50 ఏళ్లకు లీజుకు ఇవ్వాలన్న ప్రయత్నం ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే జరిగినట్లు సమాచారం. అదేవిధంగా, నల్లూరి వారి సత్రం, గోవిందరాజులు ఈనాం ట్రస్టు భూముల కేసుల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయకుండా అధికారులు వివాదాస్పద నివేదికలు సమర్పించడం, ట్రస్టీలతో కుమ్మక్కవడం వంటి ఆరోపణలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న ఆర్జేసీలలో కొందరు పదవీవిరమణ దశలో ఉండగా, మరికొందరిపై గతంలో ఏసీబీ దాడులు జరగడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో దేవాదాయ శాఖను ఏవిధంగా బలోపేతం చేయాలనే దానిపై ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది. అంతేకాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సింహాచలం చందనోత్సవానికి హాజరయ్యే విషయాన్ని ప్రారంభంలో ప్రకటించినా, చివరికి పర్యటన రద్దు చేయడం, ఆ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కూడా హాజరుకాకపోవడం ఇప్పుడు చర్చకు దారి తీసింది.

ఈ స్థితిగతుల నేపథ్యంలో దేవాదాయ శాఖలో పాలనను తిరిగి పునర్వ్యవస్థీకరించి, పూర్తి స్థాయి ఐఏఎస్ అధికారులను నియమించాల్సిన అవసరం ఉందని భక్తులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ దేవాదాయ శాఖలో ఎలాంటటి మార్పులు చేస్తే.. భక్తుల విశ్వాసం దెబ్బ తినకుండా ఉంటుందనేది ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com