కేరళలోని మలప్పురం ఫుట్‌బాల్ స్టేడియంలో ఘటన
కేరళ రాష్ట్రంలోని మలప్పురం నగరంలో ఉన్న ఫుట్‌బాల్ మైదానంలో బాణసంచా పేలిన ఘటనలో దాదాపు 30 మంది గాయాల పాలయ్యారు. మలప్పురంలోని అరీకోడ్ సమీపంలో ఉన్న ఫుట్‌బాల్ మైదానంలో సోమవారం మ్యాచ్ జరగటానికి ముందు పెద్దయెత్తున బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో కొన్ని మందుగుండు సామాన్లు మ్యాచ్ చూడటానికి గ్యాలరీల్లో కూర్చున్న ప్రేక్షకులపైకి దూసుకు రావడంతో దాదాపు 30 మందికి పైగా ప్రేక్షకులు గాయాలకు గురయ్యారు.
అరీకోడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు పటాకులు కాల్చడంతో ఫుట్‌బాల్ మైదానంలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు. పటాకులు పేలిపోయి, మ్యాచ్ చూడటానికి ప్రజలు కూర్చున్న ప్రదేశంలోకి వ్యాపించడంతో చాలా మందికి కాలిన గాయాలు అయ్యాని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అదృష్టం కొద్దీ ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని అరీకోడ్ పోలీసులు తెలిపారు.