29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

ఈవీఎంలపై బ్యాలట్‌ అస్త్రం – మహారాష్ట్రలోని ఓ గ్రామంలో సంచలనం

– అప్రమత్తమైన అధికార యంత్రాంగం
– కర్ఫ్యూ కోరల్లో మర్కర్‌ వాడీ గ్రామం
– బ్యాలట్‌ ఓటింగ్‌పై బ్రహ్మాస్త్రం
– గ్రామ ప్రజల్లో తీవ్ర నైరాశ్యం

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల పనితీరుపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. ఎక్కడికక్కడ విమర్శల వర్షం కురుస్తోంది. బ్యాలట్‌ ఓటింగ్‌ పునరుద్ధరించాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. అయితే, మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ఇదే అంశంపై చైతన్యం వెల్లివిరిసింది. తమ అభిప్రాయాలను, తమ నిర్ణయాలను మరెవరో మార్చేశారనన్న అనుమానాలు మొలకెత్తాయి. అంతే.. తమకు తామే పరీక్ష పెట్టుకోవాలని ఓటర్లంతా డిసైడయ్యారు. ఈసీ అధికారికంగా ఈవీఎంల ద్వారా నిర్వహించిన ఓటింగ్‌పై లిట్మస్‌ ప్రయోగం చేయాలనుకున్నారు. తమకు తామే పరీక్ష పెట్టుకోవాలని, తాము వేసిన ఓట్లను ఎవరు మార్చేశారో తేల్చేస్తామని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. కానీ, అధికార యంత్రాంగం వాళ్ల బ్యాలట్‌ ఓటింగ్‌పై బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. గ్రామంలో వాళ్లకు వాళ్లే పోలింగ్‌ నిర్వహించుకోవడంపై కన్నెర్రచేసింది. గ్రామంలో మూడు రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. అయినా తగ్గేదేలే.. అన్నారు మొదట గ్రామస్తులు. కానీ, సర్కారు తలచుకుంటే వాళ్లెంత? బుజ్జగించి, బతిమిలాడి, కర్ఫ్యూ విధించినా వినకపోవడంతో చివరకు బెదిరించి మరీ మర్కర్‌ వాడీ గ్రామంలో బ్యాలట్‌ పోలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో, ప్రస్తుతం గ్రామంలో ఓ రకమైన నైరాశ్యం అలుముకుంది.

మహారాష్ట్ర షోలాపూర్‌ జిల్లాలోని మల్షిరాస్‌ తాలూకా పరిధిలో ఉంటుందీ మర్కర్‌వాడీ గ్రామం. ఊళ్లో మొత్తం 1900 ఓట్లుంటాయి. ఆ 1900 ఓటర్లు వినూత్నంగా పోరాటానికి దిగారు. వాళ్లు ప్రభుత్వాన్ని విమర్శించలేదు. ఎన్నికల కమిషన్‌ను బద్నాం చేయలేదు. పోటీచేసిన అభ్యర్థులను కూడా ప్రశ్నించలేదు. తమకు తామే పరీక్ష పెట్టుకోవాలనుకున్నారు. తమ నిర్ణయాన్ని మరోసారి క్రాస్‌చెక్‌ చేసుకోవాలనుకున్నారు. కానీ, ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది. వాళ్ల చైతన్యాన్ని ఆవిరి చేసింది.

మొన్నటి ఎన్నికల్లో మల్షిరాస్‌ నియోజకవర్గం నుంచి ఎన్‌సీపీ (ఎస్‌పీ)కి చెందిన ఉత్తమ్‌ రావ్‌ జన్ఖడ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామ్‌ సత్పుతేపై 13,147 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఉత్తమ్‌రావ్‌ జన్ఖడ్‌కు మర్కర్‌వాడీ గ్రామంలో బీజేపీ అభ్యర్థికంటే తక్కువ ఓట్లు వచ్చాయి. గ్రామంలో మొత్త 1900 ఓట్లు ఉండగా.. బీజేపీ అభ్యర్థికి 1003 ఓట్లు రాగా, జన్ఖడ్‌కు 843 ఓట్లు వచ్చాయి. అయినా నియోజకవర్గం మొత్తంలో చూసుకుంటే జన్ఖడ్‌ విజయం సాధించారు. అయినా ఎమ్మెల్యే ఉత్తమ్‌రావ్‌ జన్ఖడ్‌తో పాటు.. గ్రామస్తులు కూడా ఈ అంశాన్ని తేలిగ్గా వదిలిపెట్టలేదు. సత్పుటేకు తమ గ్రామం నుంచి 100-150 ఓట్లకు మించి వచ్చేది కాదని, జన్ఖడ్‌కే అత్యధిక ఓట్లు రావాల్సి ఉందని ఓటర్లు స్పష్టం చేశారు. అందుకే తమ గ్రామస్తులు వేసిన ఓట్లను క్రాస్‌చెక్‌ చేసుకుంటామంటూ డిసెంబర్‌ 3వ తేదీ మంగళవారం మరోసారి బ్యాలట్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ ఓట్లను లెక్కించి.. తమ గ్రామ ఓటర్లు ఎటువైపు ఉన్నారో తేలుస్తామన్నారు. గ్రామంలో బ్యానర్లు కట్టారు. పోలింగ్‌ కేంద్రం దగ్గర అన్ని ఏర్పాట్లు చేశారు. అవసరమైన కుర్చీలు, షామియానాలు, ఓటింగ్‌కు అవసరమైన సరంజామా మొత్తం సమకూర్చుకున్నారు.

అయితే, ఈ విషయం అధికార యంత్రాంగానికి తెలిసింది. దీంతో, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ పరిణామంతో గ్రామంలో గ్రూపుల తగాదాలు తలెత్తవచ్చని, శాంతి భద్రతల సమస్య ఎదురు కావచ్చని ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు భారతీయ నాగరిక్‌ సురక్ష సంహితలోని సెక్షన్‌ 163 కింద కర్ఫ్యూ విధిస్తూ.. మల్షిరాస్‌ సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీచేశారు. అయినా తమ గ్రామ పరిధిలో తాము ఓటింగ్‌ నిర్వహించి తీరుతామని గ్రామస్తులు స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని కూడా అధికారులకు హామీ ఇచ్చారు. అయినా అధికారులు వదల్లేదు. కర్ఫ్యూ నిషేధాజ్ఞల కారణంగా ఓటింగ్ నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో, మంగళవారం మర్కర్‌వాడీ గ్రామంలో జరగాల్సిన బ్యాలట్‌ పోలింగ్‌ నిలిచిపోయింది.

మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామం మర్కర్‌వాడీ. ఇవాళ అధికారులు ఆ గ్రామస్తుల ఆలోచనను అడ్డుకున్నారు. అయితే, మర్కర్‌వాడీ గ్రామ ఓటర్ల చైతన్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ చర్చను లేవనెత్తింది. అంతా సజావుగానే సాగిందనుకుంటే, వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలే అయితే ఆ గ్రామస్తుల ప్రయత్నాన్ని ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందన్న ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com