– కుర్చీ కోసం షిండే చివరి ప్రయత్నాలు
మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చి పదిరోజులు కావస్తున్నా ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా క్లారిటీ రాలేదు. రేసు లో లేనంటూనే ఏకనాథ్ షిండే కూటమి నేతలకు ముఖం చూపించకుండా మీటింగులకు గైర్హాజరవుతున్నారు. ఫడ్నవిస్, షిండే, అజిత్ పవార్ ముగ్గురూ మూడు వేర్వేరు చోట్ల ఉన్నారు. మొన్నటి వరకూ సీఎం గా చేసిన తనని ఈసారీ సీఎంగా చేయాలని షిండేకు మనసులో ఉన్నా పైకి బీజేపీ ఎంపికకు కట్టుబడి ఉంటానని మోడీ , అమిత్ షాల మాట వేదవాక్కనీ అన్నారు. కానీ తెరవెనుక డిప్యూటీ సీఎం, హో శాఖలు తమకే దక్కాలన్న పట్టుదలతో షిండే వర్గం ప్రయత్నాలు చేస్తోంది.రెండు రోజుల క్రితం సొంత నియోజక వర్గం సతారాకు వెళ్లిన షిండే అక్కడ జ్వరం బారిన పడ్డారు. అక్కడ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దాంతో పార్టీ మీటింగులకు ఆన్ లైన్ లోనే అటెండ్ అవుతున్నారు. మరోవైపు బీజేపి హై కమాండ్ ఖాయం చేసిన ఫడ్నవిస్ కూడా ముంబైలో ఉన్నా ఆయన ఈ ప్రతిష్టంభనపై పెదవి విప్పడం లేదు.. ఇక వీరి మిత్రపక్షమైన ఎన్సీపి చీలిక వర్గం అధినేత అజిత్ పవార్ ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. సొంత పనుల మీదే ఢిల్లీకి వచ్చానంటున్న ఆయన డిప్యూటీ సీఎం పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ,ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ లో ఏర్పాట్లు మాత్రం పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి.
మరాఠీలంటే లోకువా?
పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న శివసేన ఉద్ధవ్ వర్గం మహాయుతి కూటమిపై ఎదురు దాడి మొదలు పెట్టింది.బీజేపికి మహారాష్ట్ర అంటే ఆసక్తి లేదని, ప్రభుత్వ ఏర్పాటు కు సహకరించకుండా సొంత పనులు చక్కపెట్టుకుంటున్నారని ఉద్ధవ్ ఠాకరే కుమారుడు ఆదిత్య ఠాకరే విమర్శిస్తున్నారు.
మహారాష్ట్రకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.288 సీట్లకు గాను 230 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. బీజేపికి 132 సీట్లు రాగాశివసేనకు 57, అజిత్ పవార్ ఎన్సీపికి 41 సీట్లు వచ్చాయి. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో మహాయుతిని మట్టి కరిపించిన మహా వికాస్ అఘాఢీ కూటమి అసెంబ్లీ కొచ్చే సరికి చతికిల బడిపోయింది. కేవలం46 స్థానాలకే పరిమితమైంది. ఈవీఎంలను టాంపర్ చేశారని అఘాడీ కూటమి ఆరోపిస్తోంది.అటువంటిదేమీ లేదంటున్న ఎన్నికల కమిషన్ ఈవీఎంలపై ఎవరైనా విమర్శలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.
హోం శాఖపైనా, డిప్యూటీ సీఎం పదవిపైనా మహాయుతి కూటమిలో క్లారిటీ వస్తే ఈ ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశాలున్నాయి.