టీమ్ ఇండియా నిలుస్తుందా? గెలుస్తుందా?
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు ఐదోరోజుకి చేరింది. అయితే ఆస్ట్రేలియా ప్రస్తుతం 333 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. చివరి వికెట్ ఇంకా మిగిలే ఉంది. ఐదోరోజు వీరిద్దరూ ఎంతసేపు ఆడితే, దానిని బట్టి టీమ్ ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. తక్కువ స్కోరు అయితే, గెలుపు కోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం అలా ఆడేవారు జట్టులో కనిపించడం లేదు. ఎందుకంటే తాపీగా ఆడాల్సిన సమయంలోనే… ఉత్తిపుణ్యానికి అవుట్ అయిపోతున్నారు…మరి టార్గెట్ ఎలా కొడతారు? ఇప్పటికి 10,20,30 చచ్చీ చెడి కొడుతున్న మన బ్యాటర్లు, ఇలా ఆడమంటే, డక్ అవుట్ అయి, కొంప మీదకు తెస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లేదంటే చక్కగా డ్రా చేసుకుంటే పరువైనా దక్కుతుందని కామెంటు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా టెయిల్ ఎండర్స్ చక్కగా ఆడుతున్నారు. అంటే పిచ్ బ్యాటింగుకి అనుకూలంగా ఉందనేది అర్థమవుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా బ్యాటర్లు కూడా అదే రీతిలో ఆడే అవకాశం ఉంది. అందువల్ల టార్గెట్ తక్కువ ఉంటే, మనవాళ్లు ఇరగదీసేలా ఉన్నారు.
రోహిత్ శర్మ నిలబడితే…ఎంత పెద్ద టార్గెట్ అయినా… ఉఫ్ మని ఊదేస్తాడు. మరోవైపు కొహ్లీ కూడా దెబ్బతిన్న బెబ్బులిలా ఉన్నాడు. అందుకని ఆస్ట్రేలియా అంత తేలిగ్గా డిక్లేర్ చేయదని అంటున్నారు. ఇంకా పంత్ కూడా సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఆఖరి వికెట్ తో ఆడి, డిక్లేర్ చేస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.