24.7 C
Hyderabad
Sunday, September 20, 2026

Live Video

spot_img

తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఫెర్టిలిటీ రేటు

తెలుగు రాష్ట్రాల్లో ఫర్టిలిటీ రేటు ఆందోళనకర స్థాయిలో తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రులకు ధీటుగా ఫెర్టిలిటీ సెంటర్లు పెరుగుతున్నాయి. ఫర్టిలిటీ రేటు అనేది ఒక స్త్రీ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందనే సూచిక. ఈ రేటు తగ్గడంతో జనాభా వృద్ధి, సామాజిక–ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుంది.

ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే  డేంజర్ బెల్స్ సూచిస్తోంది. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, తెలంగాణలో ఫర్టిలిటీ రేటు 1.8కి పడిపోయింది. ఇది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి (2014) తగ్గుదలను చూపిస్తోంది. 2015–16)లో ఈ రేటు 1.9గా ఉండగా, దీనికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (2011 సమయంలో) ఇది 1.8–2.0 మధ్య ఉండేది.

సంతానోత్పత్తి రేటు పడిపోవడం.. జనాభా వృద్ధిరేటు తగ్గడానికి కారణాలను పరిశీలిస్తే…

నగరీకరణ: హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాల్లో జీవనశైలి మార్పులు, విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయి. దీంతో ఇంట్లో వంట తగ్గించి కుటుంబమంతా ఔటింగ్ పేరుతో హోటల్లో బోజనం చేయటం ఫ్యాషన్ గా మారింది. చిన్నా పెద్ద తేడా లేకుండా జంక్ ఫుడ్ తీసుకోవటం అధికమైంది. జంక్ ఫుడ్ లైంగిక సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పౌష్టికాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విద్య, అవగాహన: మహిళల్లో అక్షరాస్యత స్థాయి పెరగడం, కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి అవగాహన పెరగడంతో 30 ఏళ్లు దాటినా పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. యువ జంటలు ప్రైవసీ, ప్రైవేటు లైఫ్ పేరుతో పెళ్లి తర్వాత ఐదేళ్ల వరకు పిల్లల ఆలోచన చేయటం లేదు.

వివాహ వయస్సు పెరుగుదల: ఆలస్యంగా వివాహాలు జరగడంతో పిల్లల సంఖ్య తగ్గుతోంది. దీనికి తోడు మనమిద్దరం మనకొకరు అనే దోరణి పెరిగింది. ఆర్థిక సమస్యలతో బిడ్డలు కనేందుకు ఇష్టపడటంలేదు. ఒకరికే పరిమితం అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫర్టిలిటీ రేటు NFHS–5 ప్రకారం 1.7కి తగ్గింది, ఇది NFHS–4లో 1.8గా ఉండేది. దీని అర్థం ఈ రాష్ట్రంలోనూ జననాల సంఖ్య స్థిరంగా తగ్గుతోంది. రాష్ట్రంలో తగ్గుదలకు కారణాలు తెలంగాణతో సమానంగా ఉన్నప్పటికీ, కొన్ని అదనపు అంశాలు కూడా ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో మార్పు: గ్రామీణ ప్రాంతాల్లో కూడా కుటుంబ నియంత్రణ పద్ధతుల వినియోగం పెరగడం. ఒకరికి మించి పిల్లలు వద్దనే భావన పెరుగుతోంది.

ఆర్థిక ఒత్తిడి: జీవన వ్యయం పెరగడంతో ఆర్థికంగా స్థిరపడేవరకు పెళ్లి ఆలోచన చేయటం లేదు. యువతీ యువకులు ఇద్దరు ఇదే ధోరణి అవలంభించటంతో లేటు వయసు పెళ్లిళ్లు సాధారణమయ్యాయి. ఆర్థిక స్వేచ్ఛ రావడంతో ఉమ్మడి కుటుంబాలు విడిపోవటం… చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత పెరిగింది.

ప్రభుత్వ విధానాలు: కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య సేవలు మెరుగుపడటం. ఐటి రంగం శరవేగంగా దూసుకుపోవడంతో తెలుగు యువత ఆ రంగంలోకి వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రేయింభళ్ల ఉద్యోగాలు చేయటంతో సంసార జీవితం ఒడిదుడుకులకు లోనవుతోంది. ఐటి రంగంలో గంటల తరబడి కూర్చునే ఉండటం సాధారణం. ఫలితంగా శారీరక వ్యాయమం తగ్గుతోందని ఇది స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు అంటున్నారు.

సామాజిక మార్పులు: చిన్న కుటుంబాల వల్ల సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో మార్పులు రావచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫర్టిలిటీ రేటు తగ్గడం విద్య, నగరీకరణ, ఆర్థిక అవసరాలు వంటి ఆధునిక జీవన శైలి కారణాల వల్ల జరుగుతోంది. ఇది స్వాగతించదగిన మార్పు అయినప్పటికీ, దీర్ఘకాలంలో జనాభా సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది.

భారతదేశంలో జనాభా స్థిరీకరణకు అవసరమైన రీప్లేస్‌మెంట్‌ రేటు 2.1 కాగా, తెలంగాణ (1.8), ఆంధ్రప్రదేశ్‌ (1.7) రెండూ ఈ స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో జనాభా వృద్ధాప్యం సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లోని నగర ప్రాంతాల్లో ఫెర్టిలిటీ రేటు (తెలంగాణలో 1.7, ఆంధ్రప్రదేశ్‌లో 1.5) గ్రామీణ ప్రాంతాల కంటే (తెలంగాణలో 1.9, ఆంధ్రప్రదేశ్‌లో 1.8) తక్కువగా ఉంది. ఫెర్టిలిటీ రేటు ఇలాగే తగ్గితే జనాభా సమతుల్యత సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం పొంచి ఉంది. కార్మిక శక్తి తగ్గడం వల్ల ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com