-
హైదరాబాద్ – శ్రీశైలం మార్గంలో కొత్త ప్రతిపాదన
-
వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ప్లానింగ్
-
30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ కారిడార్
-
శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఆకట్టుకునేలా ఐకనిక్ బ్రిడ్జ్
-
కారిడార్ పూర్తయితే రాత్రివేళ కూడా శ్రీశైలం జర్నీ
రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే కీలకమైన రహదారి మెరుగులు దిద్దుకోబోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే అత్యంత రద్దీ కలిగిన రహదారి కాగా.. ఆ తర్వాత ఎక్కువ రద్దీ ఉండే రహదారి హైదరాబాద్ – శ్రీశైలం హైవే. శ్రీశైలం పుణ్యక్షేత్రంతో పాటు.. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవాళ్లు కూడా ఈ హైవే మీదుగానే ప్రయాణిస్తుంటారు. అయితే, మధ్యలో నల్లమల ఫారెస్ట్ ఉండటంతో, ఈ రహదారి మీదుగా ప్రయాణానికి ఆంక్షలు అమలులో ఉన్నాయి. పైగా అటవీ శాఖ నిబంధనల ప్రకారం కొన్ని కిలోమీటర్ల మేర సింగిల్ రోడ్డు మాత్రమే ఉంటుంది. రాత్రివేళ ఈ రహదారిని మూసేస్తారు. మరోవైు.. రోజు రోజుకూ ఈ రహదారిపై వాహనాల రద్దీ పెరిగి పోతుండటం, అంతరాయం లేకుండా రాకపోకలు సాగించేలా సరికొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ రహదారిని విస్తరించడం, ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడం వంటివి ఈ కొత్త ప్రతిపాదనల్లో ఉన్నాయి.
125 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతీయ రహదారి.. నల్లమల ఫారెస్ట్ అమ్రాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్తుంది. ఇందులో 62 కిలోమీటర్ల దూరం రెండు లేన్ల ఘాట్లతో ఇరుకుగా ఉంది. దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవతున్నాయి. ఈ ప్రాంతంలో టర్నింగ్‌ల కారణంగా.. వన్యప్రాణులు కూడా యాక్సిడెంట్ బారిన పడుతున్నాయి. దానికి తోడు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి దూరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. ఈ కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్-శ్రీశైలం రహదారి ప్రాజెక్ట్ వివరాలు :
హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి నల్లమల్ల ఫారెస్ట్ మీదుగా రహదారి నిర్మాణం
62 కిలోమీటర్ల మేర అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
రహదారి నిర్మాణ వ్యయం అంచనా రూ.7,700 కోట్లు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు కారిడార్
శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ప్రత్యేక ఆకర్షణగా ఐకానిక్ వంతెన నిర్మాణం
ప్రాజెక్టు నిర్మాణానికి 370 ఎకరాల భూమి అవసరం
ఈ సరికొత్త కారిడార్‌తో వన్యప్రాణులకు ఇబ్బందులు లేకుండా, వృక్ష సంపదకు నష్టం కలుగకుండా భూసేకరణకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయి.. ఈ రహదారి అందుబాటులోకి వస్తే.. ప్రయాణ ఇబ్బందులు తప్పనున్నాయి. 30 అడుగుల ఎత్తులో కారిడార్ ఉండడం వల్ల.. వన్యప్రాణులకు రోడ్డు ప్రమాదాల నుంచి కూడా భద్రత కలుగుతుంది. ప్రస్తుతం రాత్రి వేళల్లో అభయారణ్యంలో వాహనాల రాకపోకలపై నిషేధం ఉంది. 30 అడుగుల ఎత్తులో ఉండే కారిడార్ వల్ల.. ఆ నిషేధాన్ని ఎత్తివేయవచ్చు.
రోడ్డును విస్తరించాక ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వాహనాలు 24 గంటలు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు. అయితే, ఫ్లైఓవర్ మధ్యలో వాహనాలు ఎక్కి, దిగేలా ర్యాంపులు నిర్మించొద్దని అటవీశాఖ సూచించింది. లైటింగ్ అధికంగా ఉంటే వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని ఎలివేటెడ్ కారిడార్‌పై రాత్రివేళ తక్కువ లైటింగ్ పెట్టాలని, నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది. మొత్తంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేవాళ్లతో పాటు, ఏపీకి వెళ్లేవాళ్లకు కూడా ఈ కారిడార్ వల్ల సమయం కలిసి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత శ్రీశైలం ప్రాంతం రవాణా, పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.