ఫెంగల్ తుఫాను నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో చర్చించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచిచంఆరు. అలాగే, ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ఈ సమయంలో తుఫాన్ పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
- Advertisement with us -