30.5 C
Hyderabad
Wednesday, June 17, 2026

Live Video

spot_img

F-35 ఫైటర్ జెట్‌ డీల్.. భారత్‌కు లాభమా? నష్టమా?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చల్లో అనేక అంశాలు వచ్చాయి. అందులో రక్షణ రంగానికి సంబంధించి అమెరికా అత్యాధునిక ఫైటర్ జెట్ F-35 అమ్మకంపై కూడా చర్చ జరిగింది. ఈ ఫైటర్ జెట్స్‌ను భారత్‌కు అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఈ యుద్ధ విమానాలను మనం నిజంగానే తీసుకుంటే ఓ గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. అమెరికా రక్షణరంగ నిపుణులు, అక్కడి మీడియా కథనాల ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యాధునికమైన ఫైటర్ జెట్స్‌ ఏవైనా ఉన్నాయంటే అది F-35 మాత్రమే. అత్యాధునిక టెక్నాలజీని వీటిని తయారు చేసేందుకు ఉపయోగించారు.

F-35 అనేది ఫిఫ్త్ జనరేషన్‌ ఫైటర్ జెట్. ప్రపంచంలో ఉన్న ఏ దేశ రాడార్‌కు చిక్కకుండా ప్రయాణించి దాడులు చేయగల సత్తా దీని సొంతమనే చెప్పాలి. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. సూదురంలో ఉన్న లక్ష్యాలపై ఇవి ఈజీగా దాడులు చేయగలవు. వీటిని అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్‌ అనే కంపెనీ రూపొందించింది. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఒక్కో వేరియంట్ ధర ఒక్కోలా ఉంటుంది.

F-35A:ఇది కన్వేన్షనల్ టేకాఫ్, ల్యాండింగ్ వెర్షన్. దీనిని యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌ ఉపయోగిస్తుంది. ఒక్కో ఫైటర్‌ జెట్‌కు 80 మిలియన్ డాలర్లు.
F-35B:ఇది యూఎస్ మెరైన్ కార్ప్స్ ఉపయోగించే షార్ట్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ వేరియంట్. దీని ధర యూనిట్‌కు దాదాపు 115 మిలియన్ డాలర్లు.
F-35C:ఇది యూఎస్ నేవీ కోసం రూపొందించింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెర్షన్. దీని ధర ఒక్కదానికి 110 మిలియన్ డాలర్లు.

ఇవి ఆకాశంలో ఎలాగైతే దూసుకుపోతాయో.. వీటి ధర కూడా ఇలా ఆకాశాన్ని తాకేలా ఉంటుంది. అంతేకాదు వీటిని మెయింటనెన్స్‌ చేయడం కూడా భారీ ఖర్చుతో కూడుకున్నదనే చెప్పాలి. ఒక్క ఫైటర్ జెట్ గంట సేపు ఆకాశంలో చక్కర్లు కొడితే 36,000 డాలర్లు ఖర్చు చేయాల్సిందే.

మాములుగా అమెరికా ఏవైనా కొత్త ఫైటర్ జెట్స్‌ను సిద్ధం చేస్తే అంతమాములుగా ఎవ్వరికి విక్రయించదు. కానీ F-35 విషయంలో మాత్రం ఈ రూల్స్‌ను బ్రేక్ చేసింది. అమెరికా మిత్ర దేశాలకు వీటిని అందించింది. ఆస్ట్రేలియా వద్ద 72 F-35లు ఉన్నాయి. యూకే, ఇటలీ, నార్వేల వద్ద కూడా F-35లు ఉన్నాయి. జపాన్, సౌత్ కొరియా, ఇజ్రాయెల్‌ కూడా వీటి కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ఇప్పుడు ఇండియా కూడా ఆర్డర్ ఇస్తే ఆ లిస్ట్‌లో మన దేశం కూడా చేరుతుంది.

నిజానికి F-35 పనితనానికి సంబంధించి అంత మెరుగైన ట్రాక్ రికార్డ్ లేదనే చెప్పాలి. ముందుగా వీటి నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నది. మన దగ్గర ప్రస్తుతం రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి 4.5 జనరేషన్‌కు చెందిన ఫైటర్ జెట్స్. F-35 అంత అత్యాధునికం కాకపోయినా మన అవసరాలకు తగ్గట్టుగా ఉంటుంది. అదే సమయంలో నిర్వహణ కూడా అంత భారంగా ఉండదు.

అయితే అమెరికా అన్ని దేశాలకు F-35లను అందిచాలనుకోవడం వెనక పెద్ద స్కెచ్ ఉందని అనేక ఆరోపణలు ఉన్నాయి. నిజానికి అమెరికా వద్ద F-22 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటిని కూడా లాక్‌హీడ్ మార్టిన్‌ సిద్ధం చేసింది. కానీ ఇవి కేవలం అమెరికన్ ఆర్మీ వద్దే ఉన్నాయి. ఏ ఒక్క దేశానికి కూడా వీటిని అందించేది లేదని తెగేసి చెప్పింది అమెరికా రక్షణశాఖ. ఎందుకంటే వీటి పనితనంలో ఎలాంటి వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. అలాంటి రిజల్ట్స్‌ వచ్చాయి వీటిని టెస్ట్ చేసినప్పుడు. అదే F-35 విషయానికి వచ్చేటప్పటికి చాలా క్రాష్‌ అయ్యాయి. మరికొన్నింటిలో ఆక్సిజన్‌ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరికొన్ని టెక్నికల్ ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ప్రపంచ దేశాలపై వీటిని రుద్దడం ప్రారంభించింది అమెరికా. ఇందులో ఇప్పుడు భారత్‌ను కూడా భాగం చేయాలని చూస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com