అటవీ సంపదకు నిలయమైన, ప్రధానంగా ఈప్రాంతానికి ఒక ఆస్తిగా మారిన ఎర్రుపాలెంను దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా చేర్చేలా అందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశ టూరిజం మ్యాప్‌లో ఎర్రుపాలెం ఉండేలా చూసుకుందామన్నారు. అలాగే, అడవులు, చెరువులను రక్షించుకుందామని…అవే మన భవిష్యత్తుకు ఆస్తి అని అన్నారు. ప్రధానంగా ఎర్రుపాలెం మండలంలో అటవీ సంపదను పరిరక్షంచుకుందామన్నారు. ఎరుపాలెం మండలం జమలాపురం గ్రామంలో ఆర్బన్ ఫారెస్ట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రకృతి పరంగా ఆహ్లాదకరంగా ఉన్న ఎర్రుపాలెం మండలాన్ని టూరిజం పరిశ్రమగా అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం పరిశ్రమ అభివృద్ధి వల్ల ఎర్రుపాలెం మండలంలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అతిధి దేవోభవ అన్న సూక్తిని జమలాపురం పర్యటనకు వచ్చే పర్యాటకుల పట్ల మనం చూపించాలని స్థానికులకు సూచించారు. జమలాపురం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అటవీశాఖ ఆధ్వర్యంలో కాటేజీలు, క్యాంటీన్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. బుచ్చిరెడ్డిపల్లి ఊరు వెళ్లే గుట్టల మధ్య ఉన్న ఇద్రీనమ్మ చెరువును టూరిజం పాయింట్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నాగార్జునసాగర్ లింకు కెనాల్ ద్వారా చెరువులో నిత్యం నీరు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క చెప్పారు. పర్యాటకులు రాత్రి బస చేసే విధంగా కాటేజీలు నిర్మాణం చేయడంతో పాటు తగిన భద్రతా చర్యలు చేపడుతామన్నారు.అభివృద్ధి చేసిన పేట చెరువు బండు ప్రాంతంలో పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. జమలాపురం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికం, ఆహ్లాదకరం సొంతం చేద్దామని పిలుపునిచ్చారు.అడవులను ధ్వంసం చేయడం అంటే మనల్ని మనం ధ్వంసం చేసుకోవడమే అని.. అడవులను ఆస్వాదిస్తూ వాటిని అభివృద్ధి చేసుకోవడమే ఎకోపార్క్ లక్ష్యమన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జమలాపురంలో అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఎకో పార్క్ పనులను ఆరు నెలలుగా పూర్తి చేస్తామని అధికారులు చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం సర్వే జరుగుతుందని, లబ్ధిదారుల జాబితాను తయారు చేస్తున్నారని, సంక్రాంతి పండుగ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.