39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

అక్రమార్కుల చెరలో ఏజెన్సీ భూములు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం రెవెన్యూ గ్రామ పరిధిలో దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములపై కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. పాల్వంచకు చెందిన కేటీపీఎస్ డి ఈ స్థాయి అధికారితో పాటు స్థానికులు ఇద్దరు ఈ కబ్జాకు శ్రీకారం చుట్టారని ఆరోపణలున్నాయి. దీంతో బాధితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే సంపత్ నగర్ కు చెందిన ఓ వృ ద్ధుడి భూమిపై కబ్జాదారులు కన్నేసి గంగారం రెవెన్యూ పరిధిలోని సంపత్ నగర్ గ్రామంలోని భూములను తప్పుడు పత్రాలతో కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారని తెలుస్తోంది.

1970 కంటే ముందు నుంచి ఇక్కడ రైతులు వారి భూముల్లో సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డులో రైతుల పేరు నమోదైంది. ఆయా భూములపై నకిలీ పత్రాలు సృష్టించి కేటీపీఎస్ లో డిఈ గా విధులు నిర్వహిస్తున్న అధికారి భూములను కొనుగోలు చేసినట్టు పాత తేదీల్లో తప్పుడు కాగితాలు సృష్టించారు. అతనికి ఓ మాజీ రౌడీ షీటర్, కొందరు స్థానికులు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సమాచారం. ఏజెన్సీ చట్టాలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ రికార్డుల్లో ఎలాంటి ఆధారాలు లేకున్నా, మరణించిన గిరిజనుల పేర్ల మీద పాత తేదీలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థానిక రైతులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. స్థానికంగా ఉండే ఓ రౌడీ షీటర్ ప్రణాళికలు రూపొందించి ఈ తంతు కొనసాగిస్తున్నాడని సమాచారం. చనిపోయిన వారి పేరుతో నకిలీ నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లను, పాత తేదీలతో సృష్టించి కేటీపీఎస్  డిఈ స్థాయి అధికారి కొనుగోలు చేసినట్లు పత్రాలను  తయారుచేసి, అధికారులను పక్కతోవ పట్టిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే 200 ఎకరాలకు పైగా ఇలాంటి నకిలీ నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లతో కబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. గంగారం రెవెన్యూ పరిధిలోని సంపత్ నగర్ గ్రామంలో 50 సంవత్సరాల నుంచి అబ్బినేని సాంబశివరావు అనే వృద్ధ రైతుకు 12.08 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసుకుంటున్నాడు. 1968లో కొండపల్లి గోపాల్ రావు అనే వ్యక్తి నుంచి సాంబశివరావు కొనుగోలు చేసినట్లు పహనీలు ఉన్నాయి. అప్పటి నుంచి రెవెన్యూ రికార్డులో సాంబశివరావు పేరు కొనసాగుతోంది. ఆ భూమిపై కబ్జాకోరుల ముఠా కన్ను పడింది. మరణించిన రైతుల నుంచి కేటీపీఎస్ లో డీఈగా పనిచేస్తున్న అధికారి నకిలీ పత్రాలు సృష్టించి కొనుగోలు చేసినట్లు రికార్డులను తయారు చేశారు.

17 సంవత్సరాల క్రితం ఆ భూమి అమ్మకాలు, కొనుగోలు జరిగినట్లు రికార్డులు తయారు చేశారు. 2008లో రెడ్డి రామయ్య నుంచి తాటి లక్ష్మయ్య కొనుగోలు చేసినట్టు ఒక నకిలీ స్టాంప్ పేపర్ పై ఫోర్జరీ సంతకాలు చేసి తప్పుడు  పత్రాలు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్టాంప్ పేపర్లను కొనుగోలు చేసినట్లు చూపించారు. అట్టి భూమిని 2017లో కేటిపిఎస్  డిఈ కి  అమ్మినట్లు మరొక నకిలీ పత్రాలను సృష్టించారు. రెడ్డి రామయ్య, తాటి లక్ష్మయ్యలు ఎప్పుడో మరణించారు. వారి పేరుతో గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు సృష్టించడంతో కబ్జా కోరుల బండారం బహిర్గతమైంది.

అసలు రైతు అబ్బినేని సాంబశివరావు, మనవడు సమాచార హక్కు చట్టం ద్వారా గుడివాడ సబ్ రిజిస్టార్ ను సమాచారం కోరగా, సదరు స్టాంప్ పేపర్ తమ కార్యాలయం పరిధిలోనిది కాదని, నకిలీదని సమాచారం ఇవ్వడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇదే తరహాలో సుమారు 200 ఎకరాలకు పైబడి తప్పుడు పత్రాలతో కబ్జాకోరులు భూముల ఆక్రమణకు పాల్పడుతున్నట్లు తేటతెలమైంది. తన దగ్గర ఉన్న ఆధారాలతో సాంబశివరావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లాస్థాయి అధికారులు కబ్జాకోరుల ఆగడాలను అరికట్టి తమ భూములకు రక్షణ కల్పించాలని గంగారం రెవెన్యూ పరిధిలోని రైతులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com