ఒడిషా, చత్తీస్ఘడ్ బోర్డర్లో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదరు కాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత చలపతి కూడా మృతి చెందినట్లు చెపుతున్నారు. చత్తీస్‌ఘఢ్‌లోని గరియాబంద్ జిల్లా ఒడిషాలోని నౌపడ జిల్లాల మధ్య ఉన్న కులరిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం ఉదయం కులరిఘాట్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని సమాచారం రావడంతో ఒడిషా, చత్తీస్ఘఢ్ పోలీసులతో పాటు సీఆర్పీఫ్ బలగాలు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ భారీ ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందగా కోబ్రా బెటాలియన్ కి చెందిన ఒక సైనికుడు కూడా గాయపడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇంకా ఈ ఉమ్మడి ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం. ఒడిషా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు ఈ ఆపరేషన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఈ కీలకమైన ఆపరేషన్‌లో మావోయిస్ట్ అగ్రనేత చలపతితో సహా 19 మంది మావోయిస్టులు మరణించినట్లు భద్రతా దళాలు ధృవీకరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాం చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి… కేంద్రప్రభుత్వ నిషేధిత వామపక్ష తీవ్రవాద సంస్ధ అయిన మావోయిస్ట్ సంస్ధకు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో చలపతి మృతి చెందడం మావోయిస్ట్‌లకు పెద్ద దెబ్బగా పోలీసులు అభివర్ణిస్తున్నారు.
ఇదిలా ఉండగా చత్తీస్ఘడ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. నక్సలిజానికి మరో గట్టి దెబ్బ తగిలిందని… నక్సల్స్ రహిత భారత్ నిర్మాణంలో మన భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని అమిత్‌షా ఎక్స్ లో పేర్కొన్నారు. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సీఆర్పీఎఫ్, ఎస్క్షజీ ఒడిషా మరియు ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో 19 మంది నక్సలైట్లను మట్టుబెట్టారని… నక్సల్స్ రహిత భారతదేశం కోసం మన సంకల్పం మరియు మన భద్రతా దళాల ఉమ్మడి ప్రయత్నాలతో మంచి ఫలితాలు ఇస్తున్నాయని అమిత్ షా సామాజిక వేదిక ఎక్స్ ద్వారా తెలియజేశారు.