29.7 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

ఫ్యూచర్‌ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ సిటీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఫ్యూచర్‌ సిటీ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేస్తోంది. దీనికి సంబంధించి అనేక ప్రత్యేకతలను ప్లాన్‌ చేస్తోంది. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధిలో భాగంగా ఏకంగా వెయ్యి ఎకరాల్లో ప్రత్యేకంగా ‘ఇ-సిటీ’ పేరుతో ఎలక్ట్రానిక్ సిటీని అభివృద్ధి చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చి దిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఫార్మా సిటీతో పాటు స్కిల్ యూనివర్సిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

తెలంగాణలో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు జాయింట్‌గా ముందుకొచ్చిన టెలికాం ఉత్పత్తుల సంస్థలు తైవాన్‌కు చెందిన సిరా నెట్ వర్క్స్, తెలంగానకు చెందిన ఎల్‌సీజీసీ రెజల్యూట్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శ్రీధర్ బాబు ఆ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఎలక్ట్రానిక్ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని టైర్ -2, టైర్ -3 నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక వేత్తల అవసరాలకు అనుగుణంగా వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యయ్యేందుకు ముందుకొచ్చిన సిరా నెట్ వర్క్స్, ఎల్‌సీజీసీ రెజల్యూట్ గ్రూప్ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందించడంతో పాటు.. అన్ని రకాలుగా అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. సుమారు 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా 2,500 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక్కడ మల్టీ లేయర్ నెట్‌వర్కింగ్‌ సొల్యూషన్స్, 5జీ నెట్ వర్క్స్, సర్వర్స్ తదితర టెలికాం ఉత్పత్తులను తయారు చేస్తారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ పెట్టుబడితో ఇండియా, తైవాన్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com