తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలకు వెళ్ళి పలువురు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడి రిజర్వాయర్ సమీపంలో గోదావరి స్నానాలకు వెళ్ళి ఐదుగురు యువకులు మృతి చెందిరు. రిజర్వాయర్ సమీపంలోని ఇసుక ర్యాంపులో వీరు స్నానాలకు వెళ్ళారు. తాడిపూడి గ్రామానికి చెందిన 11 మంది యువకులు శివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి స్నానాలకు తెల్లవారు జామునే వెళ్ళారు. ఇసుక ర్యాంపు సమీపంలో పెద్ద గొయ్య ఉండటంతో 11 మంది యువకులు ఆ గొయ్యిలో చిక్కుకుపోయారు. అయితే వీరిలో ఆరుగురు యువకులు బయటపడగా ఐదుగురు మాత్రం గల్లంతయ్యారు. గల్లంతైన యువకుల కోసం ఉదయం ఐదు గంటల నుంచి గాలింపు చర్యలు చేపట్టగా చాలాసేపటికి ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు తాడిపూడికి చెందిన అనిశెట్టి పవన్, పడాల సాయి, పడాల దుర్గాప్రసాద్, గర్రె ఆకాష్, తిరుమలశెట్టి పవన్‌లుగా గుర్తించారు. మృతి చెందిన యువకులు ఐదుగురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్ధలానికి కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, ఆర్డీఓ సుష్మితలు చేరుకుని పరిస్ధితులను పరిశీలించారు. వీరే కాకుండా శ్రీశైలం పాజెక్ట్ దగ్గర లింగాల గట్టు వద్ద పుణ్యస్నానాలకు వెళ్ళిన తండ్రీ కొడుకులు కూడా కృష్ణానదిలో గల్లంతై మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా ఎర్రాయిపేటలో కూడా ఇసుక కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.
- Advertisement with us -