ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల్లో అదనపు సిబ్బంది లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో 15,498 మంది సిబ్బంది అదనంగా ఉన్నట్టు గుర్తించారు. సచివాలయాల్లో జనాభా ప్రాతిపదికన ఎంత మంది పనిచేయాలో ఇప్పటికే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో అదనంగా ఉన్న సిబ్బందిని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో 12,126 మంది అదనంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల్లో 3,372 మంది ఉన్నారు. సచివాలయ సిబ్బందిని వారి ఆసక్తి మేరకు విధులు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన సచివాలయ ఉద్యోగులను డిప్యూటేషన్‌పై ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేస్తారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది.
మరోవైపు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడంపై ఉద్యోగులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడంతో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమన్వయం చేసి వాటిని పరిష్కరించేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో అదనంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో డిజిటల్ అసిస్టెంట్లు 173, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు 414, గ్రామ మహిళా పోలీసులు 2107మంది, వీఆర్వోలు 2899, గ్రామ సర్వేయర్ అసిస్టెంట్లు గ్రేడ్ 3- 4,722, అగ్రికల్చర్ హార్టి కల్చర్, సెరి కల్చర్ అసిస్టెంట్లు 1154, ఎనర్జీ అసిస్టెంట్లు 405, వెటర్నరీ, ఫిషరీస్ అసిస్టెంట్లు 252 మంది ఉన్నారు.
పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల్లో వార్డు వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్యదర్శులు 37, మహిళా పోలీసులు 913, వార్డు రెవిన్యూ కార్యదర్శులు 1006, వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ కార్యదర్శులు 1336, వార్డు, ఎనర్జీ కార్యదర్శులు 80 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే కొందరిని పట్టణ ప్రణాళిక శాఖకు తరలించారు. గ్రామ, వార్డు సచివాలయాలను మూడు క్యాటగిరీలుగా విభజించారు. 2500లోపు జనాభా ఉన్న సచివాలయాలను ఏ క్యాటగిరీలో, 2501 నుంచి 3500 లోపు జనాభాను బీ క్యాటగిరీగా, 3501పైగా జనాభా ఉన్న వాటిని సీ క్యాటగిరీలో చేర్చారు. 2500లోపు జనాభా ఉంటే ఆరుగురు ఉద్యోగుల పనిచేయాల్సి ఉంటుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3015 గ్రామ సచివాయాలు, 547 వార్డు సచివాలయాలు ఉన్నాయి.
మొత్తం 3562 సచివాలయాల్లో 2500లోపు జనాభా ఉంది.2501 నుంచి 3500 జనాభా ఉన్న సచివాాలయాలకు ఏడుగురు సిబ్బందిని కేటాయిస్తారు. ఈ విభాగంలో 3,884 గ్రామ సచివాలయాలు, 1504 వార్డు సచివాలయాలతో కలిపి మొత్తం 5,388 ఉన్నాయి. 3501కు పైగా జనాభా ఉన్న సచివాలయాల్లో8మంది సిబ్బందిని నియమిస్తారు. ఈ విభాగంలో 4,263 గ్రామ సచివాలయాలు, 1791 వార్డు సచివాలయాలు ఉన్నాయి. సీ క్యాటగిరీలో మొత్తం 6054 సచివాలయాలు ఉన్నాయి.ఏపీలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3841 వార్డు సచివాలయాలు ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలను వైసీపీ హయంలో ఏర్పాటు చేశారు.