ఎన్నికల కమిషన్‌ని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నడుపుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను ఈసీ తిప్పికొట్టింది. తమది ముగ్గురు సభ్యుల సంస్థ అని ఈసీ సుస్పష్టం చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌ను అపఖ్యాతి పాలుజేయడానికి ఆప్ ‘పదే పదే ఉద్దేశపూర్వకంగా పాల్పడుతున్న ఒత్తిడి ఎత్తుగడలను’ తాము ఉమ్మడిగా గమనించామని ఈసీ తెలియజేసింది. ఈసీ ఏకసభ్య సంస్థ అనే అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారని కమిషన్ విమర్శించింది.’రాజ్యాంగబద్ధమైన సంయమనం పాటించాలని తాము నిర్ణయించుకున్నామని, అటువంటి విమర్శలను తెలివిగా దిగమింగుకుంటున్నామని, అటువంటి నిందారోపణలకు ప్రభావితం కారాదని నిర్ణయించుకున్నామని ఇసి ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌లో తెలిపింది. కమిషన్ ఈ విధంగా స్పందించడం అరుదు. బీజేపీ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనను ఈసీ అలక్ష్యం చేస్తోందని ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ సహా పార్టీ అగ్ర నాయకులు ఆరోపించారు. రిటైర్‌మెంట్ అనంతర బాధ్యత స్వీకారం ఉద్దేశంతో రాజీవ్ కుమార్ బీజేపీపై చర్య తీసుకోవడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజీవ్ కుమార్ 65వ ఏట ప్రవేశించిన మీదట ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఆప్ అధికారం నిలబెట్టుకోవాలని ఆశిస్తుండగా, తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ వాంఛిస్తోంది.