కొద్దిరోజులుగా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు, పోలీసులు రంగంలోకి దిగి సచివాలయాన్ని పరిశీలించారు. కానీ అది ఫేక్ కాల్ అని, ఎలాంటి బాంబు లేదని తేల్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు SPF పోలీసులు. ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి సయ్యద్ మీర్ మొహమద్ అలీ అని, అతని వయసు ఇరవై రెండు సంవత్సరాలుగా గుర్తించారు పోలీసులు. సెక్రటేరియట్ ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి లంగర్ హౌస్ లోని దర్గా గురించి ఫిర్యాదు చేశారని, అందుకే తాను సెక్రటేరియట్ ను పేల్చి వేస్తానని ఈ యువకుడు బెదిరించినట్టు చెబుతున్నారు పోలీసులు. ఇతడ్ని దారుసలాం దర్గా దగ్గర పట్టుకున్నారు TGSPF పోలీసులు. మీర్ మొహమద్ అలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.