30.2 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి

  • గోడకూలి ఏడుగురు భక్తులు మృతి
  • ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటున్న వీహెచ్పీ
  • నాసిరకం నిర్మాణం వల్లే ప్రహరీ కూలిందంటున్న భక్తులు

ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడు మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో మహిళ పరిస్ధితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆరు మృతదేహాలను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మరో మృతదేహాన్ని శిథిలాల కింద గుర్తించారు. అయితే శిధిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నిజరూపంలో దర్శనమిస్తున్న అప్పన్న

చందనోత్సవం సందర్భంగా సింహాచల క్షేత్రంలో ఉన్న వరహా లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. ఈసందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున సింహగిరికి భక్తులు పోటెత్తారు. వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరుచేశారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తితిదే పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రొటోకాల్, అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు. ఈసందర్భంలోనే అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో 300 రూపాయల క్యూలైన్ వెళ్ళే ప్రాంతంలో ప్రహరీ కూలడంతో భక్తులపై శిధిలాలు పెద్దయెత్తున పడిపోయాయి. దీంతో ఏడు మంది భక్తులు శిధిలాల కింద ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందారు. సంఘటనా స్ధలాన్ని సందర్శించిన విశ్వహిందూ పరిషత్ నేతలు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ప్రహరీ గోడ పరిశీలిస్తే అత్యంత నాసిరకంగా నిర్మాణం చేసినట్లు స్పష్టమవుతోందని, నిర్మాణంలో సిమెంట్ కన్నా ఇసుకే ఎక్కవ కనపిస్తోందని వీహెచ్పీ నేతలు ఆరోపించారు.

ఘటనపై సీయం సమీక్ష

సింహాచలంలో ప్రహరీగోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సహాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోడకూలిన ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. చనిపోయినవారి కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సిగ్ ఉద్యోగాలు ఇస్తామని సీయం చంద్రబాబు ప్రకటించారు.

వైఎస్.జగన్ దిగ్భ్రాంతి

సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహనరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఘటనా స్ధలాన్ని పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించడానికి వైఎస్.జగన్ నేడు సింహాచలం వెళ్ళనున్నారు.

సింహాచలం ఘటన దురదృష్టకరం

సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని అధికారులు తెలిపారని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించినట్లు డీసీఎమ్ పవన్ కళ్యాణ్ తెలిపారు.

సహాయక చర్యల్లో పాల్గొన్న అనగాని

సింహాచలంలో ప్రహరీ గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన సమయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ దేవాలయ ప్రాంగణంలోనే ఉన్నారు. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి… హుటాహుటీన సంఘటనా స్ధలానికి వెళ్లి దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com