సమగ్ర కుటుంబ సర్వేలో డేటా ఎంట్రీ దశ చాలా కీలకమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్న డిప్యూటీ సీయం ఆదివారం ఉదయం జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచే ఉన్నతాధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న తీరుపై సమీక్ష నిర్వహించారు. సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటోందని ఈ దశలో డేటా ఎంట్రీలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వవద్దని డిప్యూటీ సీయం భట్టి అదికారులకు సూచించారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తితే వారికి ఫోన్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా వారి వివరాలను సేకరించమని భట్టి అధికారును ఆదేశించారు. వీలైతే ఇంటివద్ద అందుబాటులో ఉండని వారిని కోరాలని సూచించారు. అలాగే కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని. పాఠశాలలో ఆహారం, పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ రకమైన సమస్యలు తలెత్తకూడదనే మెస్, కాస్మోటిక్స్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశం, జిహెచ్ఎంసి కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.