తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం మధిరలో పర్యటించనున్నారు. ఉగాది పండుగ సందర్భంగా సొంత నియోజక వర్గంలో జరిగే పర్వదిన వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరకు చేరుకుంటారు.
ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఆదివారం ఉగాది రోజే ప్రారంభించనున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత ని యోజకవర్గం అయిన హుజూర్ నగర్‌లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కూడా హాజరవుతున్నారు. ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం జరగనుంది.
హుజూర్ నగర్ పర్యటన పూర్తయిన వెంటనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిరకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఆయన మధిర చేరుకుంటారు. సాయంత్రం మధిరలో జరిగే ఉగాది ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొననున్నారు.