శాసనసభ నిబంధనల మేరకే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీకి ఆ మాత్రం నియమ నిబంధనలు తెలియకపోవడంపై ఎద్దేవా చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశం స్పీకర్ పరిధిలో ఉంటుందని, స్పీకర్ ఆ అంశాన్ని నిర్ధారిస్తారని చెప్పారు. పదేళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న వాళ్లకు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చెప్పినన్ని రోజులు అసెంబ్లీ పనిదినాలు ఉండాలంటే ఎలా? అని సందేహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తాను శాసనసభలో విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందో, ఎలా వ్యవహరించిందో తాను స్వయంగా చూశానన్నారు. ఇప్పుడు అధికారం కోల్పోగానే హరీష్‌రావు తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలో స్పీకరే డిసైడ్ చేస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.