దేశ రాజధాని ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లోనూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వాతావరణంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో కీలక పరిణామం నమోదయ్యింది. వాస్తవానికి దక్షిణాదిలో హైదరాబాద్‌ను జన జీవనానికి అత్యంత అనుకూలమైన నగరంగా భావిస్తారు. పలు అధ్యయనాల్లో కూడా ఇదే తేలింది. దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన జనం ఒక్క హైదరాబాద్ నగరంలోనే నివసిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు.. విదేశీయులు కూడా మన దేశంలో ఇష్టపడే నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు.
అయితే, హైదరాబాద్‌లో ఆదివారం ఒక్కసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయింది. నగరంలోని బాలానగర్, మూసాపేట, కూకట్‌పల్లి, నాంపల్లి, మెహదిపట్నం వంటి ప్రాంతాల్లో గాలి కాలుష్యం ఉన్నట్టుండి ప్రమాదకర స్థాయికి చేరింది. పైన చెప్పుకున్న ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటిపోయింది. అంటే.. ప్రమాదకర స్థాయిని చేరుకుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఆ స్థాయిలో కాలుష్యం నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి, భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి తీవ్రం కాకముందే ప్రభుత్వం అప్రమత్తం కావాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రేటుతో హైదరాబాద్‌లో చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డవాళ్లు ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు.
వాస్తవానికి ఈనెల 18వ తేదీన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విడుదల చేసిన నివేదికను గమనిస్తే.. ఢిల్లీలో వాయు కాలుష్యం 567 పాయింట్లతో అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఆ సమయంలో హైదరాబాద్ 170 పాయింట్లతో ఏడో అత్యంత ప్రమాదకర నగరంగా నిలిచింది. అప్పుడు రెండో స్థానంలో నిలిచిన పాట్నాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 238 పాయింట్లు మాత్రమే నమోదయ్యింది. కానీ, ఇప్పుడు మాత్రం హైదరాబాద్‌లో రెండోస్థానంలో ఉన్న పాట్నాకు మించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 పాయింట్లకు పైగా నమోదయ్యింది. అంటే.. అతి త్వరలో హైదరాబాద్ ఢిల్లీ తర్వాత అత్యంత ప్రమాదకర వాయుకాలుష్య నగరాల జాబితాలో నిలవనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతాలన్నీ హైదరాబాద్ నగర శివార్లలో ఉండేవి. కానీ, ఇప్పుడు అవి నగరం మధ్యలోకి వచ్చేశాయి. సిటీలో అంతర్భాగంగా మారిపోయాయి. అంటే.. ఒకప్పటి శివారు ప్రాంతాలను దాటేసి హైదరాబాద్ నగరం విస్తీర్ణం పెరిగిపోయింది. దీంతో, ట్రాఫిక్ జామ్‌లు నిరంతరం, నిత్యకృత్యం అవుతున్నాయి.వాయుకాలుష్యం భారీమొత్తంలో పెరిగిపోతోంది. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కసారిగా పెరగడానికి ఈ పరిస్థితులే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు.. హైదరాబాద్‌లో రోడ్లన్నింటిపైనా ఇరువైపులా చెట్లు, భారీ వృక్షాలు ఉండేవి. కానీ, రోడ్ల వెడల్పు, విపరీతంగా పెరుగుతున్న జనాభా కారణంగా ఇప్పుడు రోడ్ల పక్కన చెట్లు దుర్భిణీ వేసి వెతికినా కనిపించడం లేదు. కనీసం రోడ్ల పక్కన చెట్లు ఉంటే వాయు కాలుష్యం ఎంతో కొంత నియంత్రణలో ఉండేది. ఇప్పుడా అవకాశం కూడా లేకుండా పోయింది.