సిరియాలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్-గాజా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలపై ఫోకస్ చేస్తుండగా.. సిరియాలో రెబల్స్ తమ శక్తి సామర్థ్యాలను పెంచుకున్నారు. ఇప్పుడు ఏకంగా అక్కడి ప్రభుత్వంపై పోరాడుతూ.. ఒక్కో నగరాన్ని తమ చేజిక్కించుకుంటున్నారు. దీంతో అక్కడి బషర్ అల్ అస్సాద్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది.
అక్కడి ప్రభుత్వ సేనలతో మూడు రోజులు పోరాడిన సిరియా తిరుగుబాటుదారులు.. సిరియాలోని అత్యంత కీలకమైన హమా నగరాన్ని ఆక్రమించుకున్నారు. విస్తీర్ణంపరంగా దేశంలో నాలుగో అతిపెద్ద నగరమైన హమా ఇప్పుడు రెబల్స్ చేతికి చిక్కినట్టైంది. హమాలో ఓ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఓ ఎయిర్‌ఫోర్స్ బేస్, సెంట్రల్ జైలు ఉన్నాయి. ఇప్పుడివన్నీ రెబల్స్ చేతికి చిక్కాయి. జైళ్లో ఉన్న వందల మంది రెబల్స్, ఖైదీలు ఇప్పుడు బయటకు వచ్చేశారు. రెబల్స్ తిష్టవేయడంతో అక్కడున్న స్థానికులంతా నగరాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు రెబల్స్ టార్గెట్ సిరియా రాజధాని డమాస్కస్ అని చెప్పాలి. ప్రస్తుతం సిరియా పాలనంతా డమాస్కస్ నుంచే కొనసాగిస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు అస్సాద్.
పేరుకు రెబల్స్ అని మనం సింపుల్‌గా అంటున్నాం కానీ.. రెబల్స్‌ను ముందుండి నడిపిస్తున్న సంస్థ హయాత్ తహరీర్ అల్ షమ్ సంస్థ. ఇది ఒకప్పుడు ఐసిస్‌కు అనుబంధ సంస్థగా ఉండేది. దీన్ని నడిపిస్తున్న అబు మహ్మద్ అల్ జులానీ ఐసీస్‌తో విడిపోయి తన ఫోకస్ మొత్తం సిరియాపైనే పెట్టాడు. జులానీని చంపేందుకు గతంలో రష్యా ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహించింది. అప్పుడు అతను చనిపోయాడని భావించారంతా. కానీ ఇప్పుడు తిరిగి వచ్చిఅస్సాద్‌కే చుక్కలు చూపిస్తున్నాడు. మేం హమాను గెలిచామంటూ అలెప్పో సిటీలో స్వేచ్ఛగా తిరుగుతూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
నిజానికి అస్సాద్ బలం రష్యా, ఇరాన్. ఇప్పుడు ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధాలతో ఈ దేశాలు బిజీగా ఉన్నాయి. దీంతో మరోసారి రెచ్చిపోతున్నారు రెబల్స్. అయితే ఇప్పుడు కూడా సిరియాకు అండగా ఉంటామని రష్యా ప్రకటించింది. మద్ధతుగా కొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌స్ట్రైక్స్ కూడా చేసింది. మరోవైపు రెబల్స్ వెనక వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిజానికి ప్రభుత్వ యంత్రాంగంతో ఇంత భారీ ఎత్తున పోరాటం చేయాలంటే ఆయుధాలు కావాలి.. డబ్బులు కావాలి. ఇవన్నీ రెబల్స్‌కు ఎలా వస్తున్నాయనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అయితే సిరియాకు సపోర్ట్‌గా ఉన్న ఇరాన్, రష్యా రెండు వెస్ట్రన్ కంట్రీస్‌కు శత్రుదేశాలే. ఇజ్రాయెల్‌పై ఇరాన్ కొన్ని రోజుల క్రితం పలు దాడులు చేసింది. వాటికి అండదండగా ఉన్నది రష్యానే అన్నది వెస్ట్రన్ కంట్రీస్ అనుమానం. అందుకే సిరియాలో రష్యాకు చెక్ పెడితే ఆ ప్రాంతమంతా తమ కంట్రోల్‌లో ఉంటుందనే భావన ఆ దేశాల్లో ఉండొచ్చు. అందుకే రెబల్స్‌కు కావాల్సిన ఆయుధాలు, అత్యాధునిక టెక్నాలజీని ఇన్‌డైరెక్ట్‌గా అందిస్తున్నారనేది ఓ వాదన.
మరి రెబల్స్‌ను అస్సాద్ సర్కార్ కంట్రోల్ చేస్తుందా? లేదా ఇలా ఒక్కోనగరాన్ని రెబల్స్‌కు అప్పగించేసి అస్సాద్ తట్టా బుట్టా సర్ధుకొని రష్యాకు పారిపోతారా? అనేది చూడాలి.