కొత్త సంవత్సరం వచ్చిందంటే న్యూ ఇయర్ విషెస్ పోటెత్తుతాయి. స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్‌లన్నీ ఆ విషెస్‌తోనే నిండిపోతాయి. మొబైల్ స్టోరేజీ కూడా ఫుల్ అయిపోతుంది. కొందరు ఇమేజ్‌లతో, చిన్న చిన్న వీడియోలతో న్యూ ఇయర్ విషెస్ పోస్ట్ చేస్తారు. మరికొందరేమో కొన్ని విషెస్ లింకులు పెట్టి ఆ లింకుల్లో న్యూ ఇయర్ విషెస్ చెబుతారు. పని ఒత్తిడిలో, వీలు కాక కలుసుకోలేని వాళ్లు కనీసం ఇలా కొత్త సంవత్సరం విషెస్‌తో పలకరించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే, పెరిగిన సైబర్ నేరాలు ఈ విషెస్ మీద కూడా పగబట్టాయి. కొత్త సంవత్సరం విషెస్ లింకులను ఎవరూ ఓపెన్ చేయొద్దని సైబర్ నిపుణులు, పోలీసులు సలహా ఇస్తున్నారు. వాటిలో ఫిషింగ్ లింకులు ఉండొచ్చని, మన మొబైల్ డేటా మొత్తం వాళ్ల సర్వర్‌లలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు.
2024 సంవత్సరం వెళ్లిపోతోంది. 2025 కొత్త యేడాది వచ్చేస్తోంది. దీంతో, దాదాపు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరూ న్యూ ఇయర్ విషెస్ వెరైటీగా డిజైన్ చేసే పనిలో మునిగిపోయారు. చాలా మంది క్రియేటివ్‌గా విషెస్ చెప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ఈ క్రమంలోనే ఫోటోలు, వీడియోలు అంతా అవుట్ డేటెడ్ అని.. క్రియేటివ్‌గా ఏవైనా వెబ్‌సైట్ లింకుల్లో న్యూ ఇయర్ విషెస్ చెప్పడం కొత్త ట్రెండ్ అని ఫీలవుతున్నారు. అందుకే న్యూ ఇయర్ విషెస్ ఎదుటివాళ్ల పేర్లతో ఇన్‌స్టంట్‌గా క్రియేట్‌చేసే వెబ్‌సైట్ల కోసం అందరూ వెతుకుతున్నారు. అయితే, ఇదంత క్షేమం కాదని సైబర్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
విషెస్ చెప్పేందుకు మనం క్రియేటివ్‌గా ఆలోచించడం కరెక్టే అయినా, ఈ నెపంతో సైబర్ నేరగాళ్లు ఆ లింకుల్లో చొరబడే ప్రమాదం ఉందంటున్నారు. లింకులను హ్యాక్‌చేసి తమ ఏపీకే ఫైల్స్ చొప్పిస్తారని అంటున్నారు. అలాంటి లింకులను మొబైల్ యూజర్స్ క్లిక్‌చేస్తే చాలు.. ఇక అంతే సంగతి అని మరీ మరీ చెబుతున్నారు. ఆ లింక్ క్లిక్ చేసిన మొబైల్ ఫోన్‌లోని ఇన్ఫర్మేషన్, పాస్‌వర్డ్స్ అన్నీ ఆ ఫిషింగ్ గ్యాంగ్స్ చేతుల్లోకి వెళ్లిపోతాయంటున్నారు. ఇలా.. మన మొబైల్స్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నెంబర్లు సహా అన్నిరకాల ఫైళ్లు వాళ్లకు చేరిపోతాయి. వాళ్ల సర్వర్లలోకి చేరిన సమాచారంతో వాళ్లు.. మన బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేసే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. అలాగే, మన సోషల్ మీడియా అకౌంట్లు కూడా హ్యాక్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశం ఉందని అంటున్నారు.
న్యూ ఇయర్ మరో మూడు రోజులు మాత్రమే ఉంది. దీనికోసం సైబర్ నేరగాళ్లు గోతికాడ నక్కల్లా కాచుక్కూర్చున్నారట. కాబట్టి.. కొత్త సంవత్సరం విషెస్ ఈసారి టెక్ట్స్‌తోనే సరిపెట్టుకోండి. క్రియేటివిటీ, వెరైటీ అంటూ వెబ్‌సైట్స్ వెంట పడ్డారో.. అంతే సంగతులు. సో.. డియర్ మొబైల్ యూజర్స్. బీ.. అలర్ట్.