– మంగళవారం శాసనసభ ప్రత్యేక సమావేశం
– బీసీ రిజర్వేషన్ల పైనే ప్రధాన చర్చ
– తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలని తీర్మానం
– ఇప్పుడైనా అసెంబ్లీకి కేసీఆర్ రావాలంటున్న కాంగ్రెస్ పార్టీ.
– తీర్మానం వల్ల ప్రయోజనం లేదంటున్న బీఆర్ఎస్
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి చేరింది. ఆ నివేదిక అసెంబ్లీలోకి వెళ్తోంది. అసెంబ్లీలో సామాజిక వర్గాల వారీ జనాభా లెక్కలపై చర్చ తర్వాత బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. రెండు ప్రధానమైన తీర్మానాలను ఈ సమావేశంలో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం ఒకటైతే.. అదేవిధంగా తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల పెంపునకు అవకాశం కల్పిస్తూ తొమ్మిదో షెడ్యూల్‌లో దీనిని ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలన్నది రెండో అంశం. తమిళనాడులో ప్రస్తుతం రిజర్వేషన్లు 69% ఉన్నాయి. అలాంటి అవకాశం తమకు కూడా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కేంద్రానికి తీర్మానం చేసి పంపనుంది.
అసెంబ్లీ సమావేశాలకు ముందు మంగళవారం ఉదయం 10 గంటలకు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్‌పై కమిషన్ ఇచ్చిన నివేదిక ఇతర అంశాలను చర్చించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలుపుతారు.
అనంతరం అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరుగుతుంది. రాజకీయంగా దీనిపై వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.
మరోవైపు.. న్యాయపరంగా 42 శాతానికి మించి రిజర్వేషన్లు బీసీలకు అమలు జరగడం సాధ్యం కాదని.. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యగానే చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. కేవలం బీసీలను మభ్య పెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మంగళవారం అసెంబ్లీలో కూడా ఇదే అభిప్రాయాన్ని ఆ పార్టీ వెల్లడించే అవకాశం ఉంది.
ఇక, న్యాయపరంగా సమస్యలు ఎదురైనా.. పార్టీ పరంగా రానున్న స్థానిక సంస్థల్లో 42 శాతం మంది బీసీలకు తమ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కొత్త వాదాన్ని తెరపై తీసుకొస్తుంది. ఇలా చేయడం వల్ల కేంద్రంలో బీజేపీ తమకు సహకరించడం లేదని ఆ పార్టీని ఇరుకున పెట్టవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అలాగే, బీఆర్ఎస్ కూడా 42 శాతం మంది బీసీలకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసే అవకాశం ఉంది.
మరి.. మంగళవారం ఒక్కరోజు మాత్రమే జరిగే అసెంబ్లీ సమావేశానికి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతారా, లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కేసిఆర్ హాజరు కాకపోతే ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి బీసీలపై ఆ పార్టీకి ప్రేమ లేదనే అంశాన్ని హైలైట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే, ఇలాంటి వ్యూహాలను దీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతోందంటున్నారు.
మరోవైపు.. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏక సభ్య కమిటీ ఇప్పటికే తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో.. మంగళవారం క్యాబినెట్‌లో ఈ అంశంపైనా చర్చించి అనంతరం శాసనసభలో ప్రవేశపెడతారు. దీంతో, ఎస్సీ వర్గీకరణ అంశం కూడా అసెంబ్లీలో చర్చకు వస్తుందంటున్నారు. మొత్తానికి రిజర్వేషన్ల అంశం అసెంబ్లీకి చేరింది. ఈ విషయంపై అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య హాట్ హాట్ గాని చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.