33.2 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

విమర్శల నుంచి విజయ తీరాలకు…ప్రజా ప్రభుత్వం

ప్రజాప్రభుత్వ విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ ఏడాది పాలన వేడుకలు ఘనంగా జరిగాయి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై విమర్శలు,లగచర్ల భూసేకరణ నిర్వాసితుల నిరసనలు అధికార పక్షానికి తల బొప్పి కట్టించింది. భూసేకరణ ఆంశం ఢిల్లీ వరకు చేరి ప్రభుత్వానికి కొంత డ్యామేజీ చేసింది. హైడ్రాతో హైరానా పడ్డ హస్తం శ్రేణులు…. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో ఉపశమనం పొందాయి.

ప్రభుత్వంపై విమర్శలు…సానుకూలంగా మారిన వైనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకే ఆ ఘనత దక్కుతుందని చెప్పవచ్చు. ఏడాది పాలనలో జరిగిన కొన్ని ముఖ్యమైన పరిణామాలు మననం చేసుకుంటే…

మూసీ సుందరీకరణ

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గ్రేటర్‌ పరిధి దాటేంత వరకు మూసీ వెంబడి దాదాపు 45 కిలోమీటర్ల పొడవున సుందరీకరణ చేపట్టాలని ప్రభుత్వం సిద్దమైంది. ఈ ప్రాంతంలోని 1600 కుటుంబాలకు డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లు… మూసీ బాధితులకు ఆర్థికంగా రూ.2 లక్షల సాయం చేస్తామని, పరీవాహక ప్రజల పునరావాసానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసీలో 90శాతం హైదరాబాద్ మురుగు చేరుతుందని… దానిని శుద్ధి చేసేందుకు మంచి వాతావరణం అందించేందుకు రూ.3800 కోట్లతో 31 ఎస్‌టీపీలు గత ప్రభుత్వం విడుదల చేసిందని విపక్ష నేతలు గుర్తుచేశారు. పలు ఎస్‌టీపీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పాతవి కొత్తవి కలిపితే 1900 ఎమ్‌ఎల్‌డీల మురుగు శుద్ధి అవుతుందని… దాంతో నల్గొండ వాసులకు కూడా మేలు చేకూరుతుందన్నారు.

అధికార పక్షనేతల వాదన మరోలా ఉంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కాలుష్యానికి గురైన హాన్ నదిని ఆ దేశ ప్రభుత్వం శుభ్రపరచి, పునరుద్ధరించిందని ఆ కోవలోనే మూసి సుందరీకరణ చేసి హైదరాబాద్ కు అహ్లాదవాతావరణం అందిస్తామని ప్రకటించింది.

హైడ్రా లక్ష్యం… విమర్శలు

కబ్జాదారులు చెరువులను చెరపడుతూ హైదరాబాద్ మహానగరాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని… ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా చెరువుల పరిరక్షణ కోసం నడుం బిగించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చి వేశారు. ఈ మేరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 1979 నుంచి 2023 వరకు అందించిన నగర పరిధిలోని దాదాపు 56 చెరువుల శాటిలైట్ చిత్రాలను పరిశీలించారు. అందులో కొన్ని 60 శాతం, మరికొన్ని 80 శాతం మేర కుంచించుకుపోయినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.

హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచే హుస్సేన్ సాగర్ కూడా 21 శాతం కబ్జాకు గురైనట్లు హైడ్రా విచారణలో తేలింది. బతుకమ్మ కుంట, తుమ్మలకుంట వందకు వంద శాతం కనుమరుగైంది. ఈ క్రమంలోనే చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా మూడు దశల్లో పనులు చేపట్టింది. మొదటి దశలో ఎఫ్​టీ ఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి కట్టడి చేయడం, రెండో దశలో ఇప్పటికే నిర్మించిన వాటిని కూల్చివేయడం, మూడో దశలో గొలుసు కట్టు చెరువులకు ప్రాణం పోసేలా నాలాలను పరిరక్షించడం, చెరువుల్లో పూడిక తీయడం ప్రాధాన్యతలుగా హైడ్రా నిర్ణయించింది.

మొదట్లో బడాబాబుల అక్రమ నిర్మాణాలను కూల్చివేసినపుడు ప్రభుత్వానికి ప్రశంసల జల్లు వచ్చినా… ఆ తర్వాత విమర్శలకు దారితీసింది. హైడ్రా జిల్లాలకు విస్తరిస్తోందని…కొన్ని ప్రాంతాల్లో మధ్యతరగతి వారికి నష్టం జరుగుతోందని ప్రచారం జరిగింది.
లగచర్ల భూసేకరణ వివాదం
ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్లలో ఫార్టీ సెజ్ కు భూసేకరణ ఆంశంలో ప్రజాభిప్రాయసేకరణకు వెళ్లిన కలెక్టర్, ఆర్ డిఓ తదితర అధికారులపై రైతులు దాడి చేయటం దుమారం లేపింది. అందివచ్చిన అస్త్రంలా విపక్షాలు ఈ ఆంశాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లాయి. దీంతో ఫార్మ సెజ్ కు భూసేకరణ నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది.
ఈ మూడు వ్యవహారాల్లో ప్రభుత్వం ఇరుకున పడ్డా…. ఏడాది పాలనపై ప్రజా విజయోత్సవాలతో సాగిన సందడి వీటన్నింటినీ మరిచిపోయేలా చేసింది. ఈ ఆంశంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి క్రతక్రుత్యులయ్యారనే చెప్పాలి.
విజయోత్సవాల పేరిట వారం రోజులపాటు వివిధ అభివ్రద్ది కార్యక్రమాలు చేపట్టడం…ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ప్రభుత్వ లక్ష్యాలు వివరిస్తే… ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు గణాంకాలతో సహా వెల్లడించారు.
ఇద్దరు నేతలు జోడెద్దుల మాదిరి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో సమన్వయంతో పాల్గొంటూ పార్టీ శ్రేణులు, ప్రజలను పాజిటివ్ మోడ్ లోకి తీసుకెళ్లారు.
ఈ తరుణంలో తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పుల మీద విపక్షాలు విమర్శలు చేయగా ధీటుగా బదులిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులపై ఏకంగా శాసనసభ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వాదన ప్రజల్లోకి తీసుకెళ్లటంలో విజయం సాధించారు.
రాష్ట్రంలో ఇప్పుడు కేవలం తెలంగాణ తల్లి విగ్రహం మీదనే చర్చ జరుగుతోంది. తెలంగాణ సగటు మహిళకు ప్రతీకగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామని కాంగ్రెస్ చెపుతుంటే…. తెలంగాణ తల్లికి పేదరికం ఆపాదించారని గులాబీ నేతలు దండెత్తుతున్నారు. వీరికి తోడు బిజెపి కూడా సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టపన జరిగిన డిసెంబర్ 9వ తేదీని అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదే రోజు కాంగ్రెస్ ఆధినాయకురాలు సోనియాగాంధీ పుట్టినరోజు కావడం గమనార్హం. సందట్లో సడే మియా అన్నట్టుగా రెండు కార్యక్రమాలు కాంగ్రెస్ నేతలకు కలిసి వచ్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com