- తరగతి గదులకు ఆవుపేడ పూసిన ప్రిన్సిపాల్
- వేసవి వేడిని తట్టుకునేందుకు హీట్ రెసిస్టెంట్ అనే భావన
- బ్లాక్ సీ ఓల్డ్ బిల్డింగ్ కావడంతో అధిక వేడి
- ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేక క్లాస్ రూమ్స్
- వర్సిటీకి నిధుల కొరత
- ప్రిన్సిపాల్ చర్యతో సోషల్ మీడియాలో చర్చ
- పురాతన భావజాలం రుద్దుతున్నారన్న భావన
- సంప్రదాయమా? ఆధునికతా?
- వర్సిటీ గ్రూపుల్లో తీవ్రమైన చర్చ
వేసవి వేడితో హీటెక్కి పోతున్న ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల తరగతి గోడలను చల్లబరిచేందుకు అక్కడి ప్రిన్సిపాల్ ఓవెరైటీ విధానాన్ని అవలంబించారు. లక్ష్మీబాయ్ కాలేజ్ కు చెందిన ప్రిన్సిపాల్ క్లాస్ రూమ్స్ ని చల్ల బరచడానికి వినూత్నంగా ఆలోచించారు. బ్లాక్ సిలో తరగతి గది గోడలకు తానే స్వయంగా కుర్చీలెక్కి మరీ ఆవుపేడను పూశారు. ఇండోర్ ఉష్ణోగ్రతలను చల్లబరిచేందుకు పురాతన సంప్రదాయమైన ఆవుపేడను పూయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు తెర లేపింది. వర్సిటీకి మౌలిక వసతుల కల్పనకు తగిన బడ్జెట్ లేకపోవడంతో పాతకాలం నాటి సంప్రదాయాన్ని ప్రిన్సిపాల్ ప్రత్యూష వత్సల తెరపైకి తెచ్చారు. పర్యావరణ హితమైన ఈ ఆచారం మంచిదే అయినప్పటికీ ప్రోగ్రెసివ్ భావజాలంతో నడిచే యూనివర్సిటీ ప్రాంగణంలో అందునా ఒక ప్రిన్సిపాల్ చేయడం కలకలం రేపుతోంది. వాట్సప్ లోనూ సోషల్ మీడియాలోనూ ప్రిన్సిపాల్ ఆవుపేడ పూస్తున్న వీడియోలు హల్ చల్ చేయడంతో ఇది పెద్ద చర్చకు దారి తీసింది.
వత్సల తానే స్వయంగా ఆవుపేడను ఇతర సిబ్బందితో కలసి గోడలకు పూస్తున్న వీడియో సంచలనం గా మారింది. క్లాస్ రూమ్స్ ని మరింత సౌకర్యవంతంగా ఉంచేందుకు చేసిన ప్రయత్నమేనని యూనివర్సిటీలో బ్లాక్ సీ అత్యంత పురాతన భవనం. పైగా భవనం కింద క్యాంటిన్ ఉండటంతో మరింత వేడిగా ఉంటుంది. వేసం కాలం స్టూడెంట్లు కూర్చునేందుకు తరగతి గది ఏ మాత్రం అనువుగా ఉండటం లేదని సహ సిబ్బందే చెబుతున్నారు.
అయితే మరుగున పడుతున్న పురాతన సంప్రదాయాన్ని పాటించడం తప్పు కాకపోయినా, ఏళ్ల తరబడి వినియోగించిన ఆ పాత భవనం శిధిలావస్థకు చేరుకుంటోంది. కనీస సౌకర్యాలైన బెంచీలు, వెంటిలేషన్ కూడా సరిగా లేక చీకటి గుయ్యారాలను తలపిస్తున్నాయి. ఫ్యాన్లు కూడా ఎక్కువ సంఖ్యలో లేవు. ఎయిర్ కండిషనర్లు, కూలర్లు లేకపోగా కనీసం వాష్ రూమ్స్ కూడా సరిగా లేవు. వర్సిటీకి నిధుల కొరత పట్టిపీడిస్తోంది. భవనాలను బాగుచేసేందుకు డబ్బు లేకపోవడంతో అధ్యాపక సిబ్బంది కొంతలో కొంత ఎదైనా మెరుగుదల చేద్దామనే ఉద్దేశంతోనే ఈ రకంగా చేశారంటూ మరికొందరు విద్యార్ధులు చెబుతున్నారు.
చర్చనీయాంశంగా ఆవు..
పూర్వకాలంలో ఏసీ ల కల్చర్ రాకముందు పల్లెటూళ్లలో ఆవుపేడే గతి. వేసవి కాలంలో ఎండ తాపాన్ని తట్టుకోడానికి ఆ పేడను ఇంటి గోడలకు పూసి పూరిపాకలు, పూరిళ్లకు హీట్ రెసిస్టెంట్లుగా వాడే వారు. ఈ సంప్రదాయాన్ని అప్పుడు బాగా నమ్మేవారు. అయితే గో మూత్రం, ఆవుపేడ ఔషధ విలువలు కలిగినవన్న ప్రచారంపై వివాదం నడుస్తోంది. హిందూ ధర్మ ప్రచారం పేరుతో ఆవుకు పవిత్రతను ఆపాదించి ఆకాశానికెత్తేస్తున్నారన్న అభిప్రాయాలూ ఉన్నాయి. అలాంటి అంశాన్ని వర్సిటీలలో ప్రామాణికంగా పాటించడం హిందూత్వ సనాతన భావజాలాన్ని అధికారికంగా రుద్దడమేననే వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనలను యూనివర్శిటీ వర్గాలు కొట్టిపారేస్తు్న్నాయి. గోడలకు ఆవుపేడ అలకడం ద్వారా తరగతి గది వాతావరణంలో చల్లదనం వచ్చిందా లేదా అనేదే లెక్క అని పలువురు విద్యా్ర్థులు కూడా ప్రిన్సిపల్ చర్యకు మద్దతు తెలుపుతున్నారు.