32.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

తాను పతనమై ఆప్‌ని అంతమొందించిన కాంగ్రెస్‌

కాంగ్రెస్…  గ్రాండ్ ఓల్డ్ పార్టీ. స్వాతంత్ర్యానికి ముందు నుంచి దేశంలో ఉన్న ఈ పార్టీ చరిత్ర ఓ ఘనకీర్తి. కానీ ఇదంతా నిజంగా చరిత్రే. ఎందుకంటే వర్తమానంలో ఈ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయం. ఎన్నిక ఏదైనా ఓటమి కామన్‌గా మారింది కాంగ్రెస్‌కు. గుడ్డిలో మెల్ల ఏదైనా ఉందంటే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో గెలుపు తప్ప.. అన్నింటిలోనూ ఓటమే. నిజానికి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అధికారపార్టీలపై ఉన్న వ్యతిరేకతతో గెలిచాయి కానీ లేదంటే ఇక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదనే చెప్పాలి. తెలంగాణ విషయం తీసుకుంటే వరుసగా రెండు పర్యాయాలు అధికారం చెలాయించిన కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలకు మొహంమొత్తడం ఒక కారణమైతే… రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టి ఊరూవాడ తిరిగి కేసీఆర్‌పై తీవ్రమైన విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళడం రెండోదైతే… పార్టీలో ఎవరు సహకరించినా ఎవరు సహకరించకపోయినా సీఎల్‌పీ నాయకుడిగా ఉన్న భట్టి విక్రమార్క కాళ్ళకు బలపాలు కట్టుకుని యావత్‌ రాష్ట్రం నలుమూలలు పాదయాత్ర చేయడం మూడో కారణం. ఈ కారణాల వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచింది తప్పితే గాంధీల ప్రభావం ఏమీ లేదని ఢిల్లీ ఫలితాలతో దేశం మొత్తం అవగతమై ఉంటుంది.

ఇక ఇటీవలే జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. లెటెస్ట్‌గా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో అయితే పరిస్థితి అత్యంత దయనీయం. కనీసం చెప్పుకోవడానికి ఒక్క సీటు కూడా గెలవలేదు ఈ పార్టీ. నిజానికి ఢిల్లీని నాలుగుసార్లు పాలించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.  నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కాస్త పుంజుకున్నట్టుగానే కనిపించింది. గతంతో పోలిస్తే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 44 సీట్లు గెలుచుకోగా.. 2019 వచ్చే సరికి 52 సీట్లు గెలుచుకుంది. ఇక 2024లో జరిగిన ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్. రాజ్యాంగం, రిజర్వేషన్లు,  నిరుద్యోగం వంటి అంశాలను హైలేట్ చేస్తూ ముందుకు వెళుతుంది కాంగ్రెస్. కానీ ఇవి ఆశించిన మేర ఫలితాలను చూపించడం లేదు. కనీసం పోటీ కూడా ఇచ్చేందుకు పనిచేయడం లేదు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో ఫుల్ జోష్‌తో రంగంలోకి దిగింది కాంగ్రెస్. కానీ బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో చతికిలపడింది. రాష్ట్రంలో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసి కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చింది బీజేపీ. ఇక మహారాష్ట్రలోనూ సేమ్ సీన్. ఇక్కడ కూటమిగా ముందుకు వెళ్లిన మరాఠా ప్రజలు అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఢిల్లీలో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది కాంగ్రెస్. దారుణమైన విషయం ఏమిటంటే ఢిల్లీ రాజధానిలో ఉన్న అసెంబ్లీలో గత మూడు పర్యాయాలుగా జీరో ఫలితాలను సాధించింది కాంగ్రెస్‌ పార్టీ. 2015, 2020, 2025 వరుసగా మూడు తడవలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేపోయింది.

నిజానికి ఆప్‌ ఈసారి అధికారానికి దూరం కావడానికి కాంగ్రెసే కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పలు మైనార్టీ సీట్లలో బీజేపీ విజయం వెనుక కచ్చితంగా కాంగ్రెస్ ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు. బీజేపీ, ఆప్ మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం ఐదు శాతమే ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ ఓట్ల శాతం 6.7గా ఉంది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏ స్ధాయిలో ఓట్లు చీల్చిందో అర్దమవుతోంది. నిజానికి గెలుపుపై నమ్మకంతో కాంగ్రెస్‌ను పక్కన పెట్టేశారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. కానీ అతని ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కు చెక్ పెట్టింది కాంగ్రెస్.  ఢిల్లీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తాను చనిపోతూ ఆమ్‌ ఆద్మీ పార్టీని కూడా చంపేసిందనే వాదనలు రాజకీయవర్గాల్లో వస్తున్నాయి.

కాంగ్రెస్‌ ఓట్లు చీల్చడం ఆప్‌కు ఎంత నష్టం చేసిందనడానికి సంగమ్ విహార్ అనే ఓ నియోజకవర్గాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ గెలిచిన బీజేపీ అభ్యర్థి చందన్ కుమార్ చౌదరికి 54,049 ఓట్లు పడ్డాయి. అతను ఆప్ అభ్యర్థి దినేష్‌పై కేవలం 344 ఓట్ల తేడాతో గెలిచారు. అదే సమయంలో ఇక్కడ బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థికి 15,863 ఓట్లు పడ్డాయి. సో ఈ నియోజకవర్గంలో ఓట్లు చీలేందుకు కాంగ్రెస్ ఓ కారణంగా మారింది. నిజానికి ఆప్‌, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తే మరిన్ని ఎక్కువ సీట్లు సాధించడం ఖాయమనే చెప్పాలి. అయితే కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో కావాలనే ఆప్‌ పార్టీని నిర్మూలించాలనే ఉద్దేశంతో పనిచేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆప్‌ అడ్డు తొలిగితే వచ్చే సారైనా బీజేపీ కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com