శతాబ్దం పైబడి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటోంది. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ అని, దశాబ్దాల పాటు దేశాన్ని పాలించామని గొప్పలు చెప్పుకుంటూ మురిసిపోయే కాంగ్రెస్‌పార్టీ.. తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. ఇప్పటికే నిలువులోతు గోతిలో పడిపోయినా రియలైజ్ కావడం లేదు. తన సహజ స్వభావాన్ని మార్చుకోవడం లేదు. ఫలితంగా క్యాడర్‌లో తీవ్ర నైరాశ్యం నిండిపోతోంది.
కాంగ్రెస్ పార్టీని కొన్నేళ్లుగా వరుస పరాభవాలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి ఘోర ఓటమి మూట గట్టుకుంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా వరుసగా ఎదురవుతున్న ఓటములతో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. అయినా, ఓటములకు కారణాలు విశ్లేషించుకోవడం లేదు. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయడం లేదు. రాష్ట్రాల నాయకత్వాలకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ఈ పరిణామాలు చివరికి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
దేశానికి గుండెకాయగా చెప్పుకునే దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జీరో కంట్రిబ్యూషన్ సిగ్గుచేటు అని పార్టీ వర్గాలే అధిష్టానంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. పదేళ్లుగా ఢిల్లీ అసెంబ్లీలో ఒక్క సీటు లేకపోవడం, అసలు ప్రాతినిథ్యమే లేకపోవడం కాంగ్రెస్ దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీలో ఒకప్పుడు చక్రం తిప్పిన పార్టీ, హ్యాట్రిక్ విజయాలు సాధించి.. ఢిల్లీ రాష్ట్రంలోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కనీస ప్రాతినిథ్యం కూడా కరువయ్యే దుస్థితికి చేరుకోవడం ఆ పార్టీ పతనావస్థకు నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో వరుసగా మూడోసారి కాంగ్రెస్‌పార్టీకి జీరో సీట్లు నమోదయ్యాయి. 2015లో ఒక్కసీటు కూడా గెలవని కాంగ్రెస్‌పార్టీ… 2020లోనూ అదే ఒరవడిని కొనసాగించింది. ఇప్పుడు 2025లో కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంపై ఆ పార్టీ అధినాయకత్వం తీరును ఆయా రాష్ట్రాలకు చెందిన సొంత పార్టీ నేతలే ఎండగడుతున్నారు.
వాస్తవానికి ఈ పరిస్థితులకు, ఈ పరిణామాలకు బాధ్యులు ఎవరో కాదు. కాంగ్రెస్‌పార్టీ చావుకు కాంగ్రెస్సే కారణం అని చెప్పుకోవడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. అఖిల భారత కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం అంతా హస్తినలోనే ఉంటారు. పార్టీ జాతీయ కార్యాలయం ఢిల్లీలోనే ఉంటుంది. పార్టీని తామే నడిపిస్తున్నామని చెప్పుకునే ఉద్ధండులంతా ఢిల్లీలోనే ఉంటారు. అన్ని రాష్ట్రాల నాయకత్వాన్ని వాళ్లంతా కనుసైగలతో శాసిస్తారు. ఢిల్లీలో ఉండి రాష్ట్రాలపై పెత్తనం సాగిస్తారు. కానీ, తాము తిష్ట వేసుకున్న ఢిల్లీలో మాత్రం ఒక్కసీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశమంటున్నారు కాంగ్రెస్‌పార్టీ కేడర్.
దారుణాతి దారుణంగా ఓటమి పాలవుతున్నా.. అధిష్టానం పార్టీని సరిదిద్దే చర్యలు, గాడిన పెట్టే నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఏం చేసినా ఆ పార్టీ గ్రాఫ్ మాత్రం పెరగడం లేదు. ఇక, అంతర్గత కుమ్ములాటలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరన్న నానుడి ఉంది. అసలు ఆ కుమ్ములాటలకు అధిష్టానమే ఆస్కారం ఇస్తుందన్న చర్చ కూడా ఉంది. ఢిల్లీలో కూర్చొని రాష్ట్రాల పార్టీ నాయకత్వాలపై పెత్తనం సాగించడం, పార్టీ నేతల మధ్య వివాదాలు సృష్టించేలా వ్యవహరించడం వంటివి కాంగ్రెస్‌పార్టీని నెమ్మది నెమ్మదిగా దెబ్బతీశాయి. క్రమంగా పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే స్థితికి తీసుకొచ్చాయి. ఈ పరిస్థితులు ఒకరకంగా కాంగ్రెస్‌పార్టీపై జాలి కలిగేలా చేస్తున్నాయి. అసలు ఈ దేశాన్ని అత్యంత సుదీర్ఘకాలం పాటు తిరుగులేకుండా పాలించిన పార్టీయేనా అన్న సందేహాలు కూడా వచ్చేలా చేస్తోంది.
కొన్ని రాష్ట్రాలలో స్థానిక పరిస్థితులు, స్థానిక నాయకులకు ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగానే కాంగ్రెస్‌కు అధికారం దక్కింది తప్ప.. జాతీయ నాయకత్వాన్ని చూసి కాదని ఎవరిని అడిగినా చెబుతున్నారు. తెలంగాణలోనే చూసుకుంటే రాహుల్‌గాంధీని చూసి ఎవరూ ఆ పార్టీకి ఓటేయలేదు. రేవంత్‌రెడ్డి దూకుడు, భట్టి విక్రమార్క పాదయాత్ర కారణంగా కాంగ్రెస్‌పార్టీకి తెలంగాణలో అధికారం దక్కిందన్నది ఎవరు అవునన్నా, కాదన్నా ఇదే వాస్తవం.
ఇక, ఏఐసీసీ పెద్దల తీరు చూస్తే ఏ రాష్ట్రంలోనూ స్థానిక నాయకత్వాన్ని అస్సలు ఎదగనీయరు. కాస్తంత ప్రజాదరణ వస్తుందనగానే వెనక్కి లాగుతారు. ఒకప్పుడు సోనియా భజన చేసే కాంగ్రెస్ కురువృద్ధులు.. ఇప్పుడు రాహుల్ గాంధీ భజన సాగిస్తున్నారు. ఆ భజనతోనే స్వతహాగా ఛరిష్మా ఉన్న నాయకులను కూడా ఎదగకుండా చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, గుజరాత్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ఇలా ఏ రాష్ట్రంలోనూ సొంత ఛరిష్మా ఉన్నవాళ్లను ఎదగనీయరన్న అభిప్రాయం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పెద్దలపై ఉంది. ఎక్కడ కూడా.. ఫేస్‌వాల్యూ ఉన్నవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వరు. మాస్ లీడర్లకు ప్రోత్సాహం ఉండదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే చూసుకుంటే.. అప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న సొంత ఇమేజ్ చూసి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. పార్టీనుంచి బలవంతంగా గెంటేశారు. కానీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరిగా, తనే ఒక సైన్యంగా ఎదిగారు. ఎవరి అండ లేకున్నా, పార్టీలన్నీ మూకుమ్మడిగా ఇబ్బందులు సృష్టించినా, సొంతంగా పార్టీ పెట్టి గెలిచి ముఖ్యమంత్రి అయి చూపించారు. ఇక, ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా ఇదే పరిస్థితి ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ఏదో చేద్దామని దూసుకెళ్తున్నా అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంలేదు. చీటికీ మాటికీ హస్తినకు పిలవడం, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని మాత్రమే కాకుండా.. ఇతర నేతలను కూడా పిలిపించుకోవడం అభిప్రాయాలు తీసుకోవడం, కాలయాపన చేయడం వంటివే చేస్తున్నారు తప్పితే.. అవకాశం ఉన్నవాళ్లకు, ఏదైనా చేయగలమని చేసి చూపిస్తున్న నేతలకు కూడా సొంత నిర్ణయాలు తీసుకునే వెసులబాటు ఇవ్వడం లేదు. అందుకే ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. నిన్నటి మీడియా చిట్‌చాట్‌లో కేబినెట్ విస్తరణ గురించి జర్నలిస్టులు ప్రస్తావించిన సమయంలో.. అంతా అధిష్టానమే చూసుకుంటుందని చెప్పారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, విజయవంతంగా మేనిఫెస్టోను దశల వారీగా అమలు చేస్తున్న నాయకుడిగా. అన్నింటికీ మించి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సరైన కౌంటర్ ఇస్తున్న నాయకుడిగా దూసుకెళ్తున్న రేవంత్‌రెడ్డికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత అధిష్టానం ఇవ్వడం లేదు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలమంటూ చెప్పుకునే వాళ్ల నిర్ణయాలు, కంటిచూపుతోనే శాసించగలమనుకుంటున్న నేతల తీరుతో.. ఇప్పుడు ఢిల్లీలో పార్టీ సర్వనాశనమయ్యింది. అధిష్టానానికి గానీ, స్థానిక నాయకత్వానికి గానీ ఓ ప్లానింగ్ లేదు. ఫలితంగా పార్టీని నడిపించడం కూడా చేతగాదన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో ప్రతీ పరిణామానికీ నిరంతరం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైనప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణి తప్పనిసరి అవుతుంది. గతంలో ఏమో చేశామన్న గొప్పలు చెప్పుకోవడం కాకుండా.. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందన్న అంచనా వేసుకోవడం కూడా ముఖ్యమే. సీట్ల విషయంలో మొండి పట్టు పట్టకుండా.. భాగస్వామ్య పార్టీ విజయాన్ని కాంక్షించే మనస్తత్వం అవసరం. ఎందుకంటే భాగస్వామ్య పార్టీ గెలిస్తే.. తాము గెలిచినట్లే అన్న భావనతో ముందుకెళ్తే… పార్టీని నెమ్మదిగా అయినా పైకి తీసుకువచ్చేందుకు అవకాశాలుంటాయి. కానీ, ఉన్నపళంగా పార్టీని చేజేతులా చంపుకునే చర్యలకు కాంగ్రెస్‌పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారని ఢిల్లీ ఎన్నికలే నిరూపించాయి. ఇప్పటికైనా తమ ఓటమికి ఈవీఎంలంటూ, ఇంకేదో కారణమంటూ తిట్టడం, ఆరోపణలు చేయడం, ఈసీని ప్రశ్నించడం మాని పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాల్సిన అనివార్యతను ఇప్పటికైనా కాంగ్రెస్‌పార్టీ గుర్తెరిగితే చాలంటున్నారు ఆ పార్టీ నేతలు.