26.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

గ్రేటర్‌లో పట్టు కోసం కాంగ్రెస్‌ వ్యూహాలు

  • గ్రేటర్ హైదరాబాద్‌ అభివృద్ధి పై యాక్షన్ ప్లాన్
  • గ్రేటర్ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వ్యూహాలు
  • మంత్రి శ్రీధర్ బాబుకు గ్రేటర్ బాధ్యతలు

గ్రేటర్ హైదరాబాద్ పై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. 2023లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్ధానాల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ లో ఆశించిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి రాలేదు.  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ లోను గ్రేటర్ ఎమ్మెల్యేల విషయంలోనూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటూ ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ హడావిడి చేస్తున్న నేపథ్యంలో గ్రేటర్లో పూర్తి స్థాయిలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌ని పెంచేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. ఐటీ ఎంప్లాయిస్.. ఎలైట్ సెక్షన్… చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే గ్రేటర్ పరిధిలో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని ఫోకస్ చేస్తూ ముందుకు పోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన.

ప్రస్తుతం ఐటి శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబుకు పార్టీ పరంగా ఈ బాధ్యతలను అప్పగించారని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ మరో ఏడాది కాలంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఈ మహానగరంపై పట్టు సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది.  వచ్చే ఏడాది జరిగే హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్దంగా ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. దావోస్ పర్యటన తర్వాత గ్రేటర్ పరిధిలో పార్టీకి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా దావోస్‌ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రైజింగ్‌ టీమ్‌ అక్కడ అద్భుతమైన విజయాలు సాధించుకు వచ్చింది. ఇందులో ప్రధాన భూమిక ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుదే అని ఇటు ప్రభుత్వంతో పాటు పార్టీ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. దాదాపు లక్షా 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు రేవంత్‌, శ్రీధర్‌బాబుల బృదం తీసుకువచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది.  ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్‌బాబుకు ఉన్న క్లీన్‌ అండ్‌ ఇన్వెస్టర్స్‌ ఫ్రండ్లీ ఇమేజ్‌ను ఉపయోగించుకుని హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో లబ్ది పొందాలన్నది కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఐటీ మంత్రిగా శ్రీధర్ బాబుకు సాఫ్ట్‌వేర్‌ రంగంతో పాటు చదువుకున్న వర్గాలలో మంచి గుర్తింపు ఉండడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్‌ సిటీకి సమాంతరంగా శ్రీశైలం హైవే వైపు ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అడుగులు వెయ్యడం ఒక ఎత్తైతే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరో రెండు ఐటీ పార్కులు నిర్మిస్తామని ఇటీవలే మంత్రి శ్రీధర్‌ బాబు చేసిన ప్రకటనకి విపరీతమైన స్పందన వచ్చింది. శ్రీధర్‌బాబు ప్రకటనతో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉత్తేజం కలగడంతో పాటు దాదాపు సంవత్సర కాలంగా నిద్రాణంగా ఉన్న హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా కొత్త ఊపిరిలు అందాయి. ఈ నేపథ్యంలో శ్రీధర్ బాబు గ్రేటర్ బాధ్యతలు చూడటం వల్ల కలిసి వస్తుందన్న అభిప్రాయం పార్టీ ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు మరో రెండు కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వము ఉంది. ఒకవేళ కార్పొరేషన్‌ల ఏర్పాటు సాధ్యం కాకపోతే ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసి వార్డులను 150 నుంచి 200 వరకూ పెంచాలని భావిస్తున్నారు.  మొత్తానికి ఎక్కడైతే తాము కొంత వెనుకబడి ఉన్నామో అక్కడే తమ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ అన్ని విధాలుగా ప్రయత్నాలు ప్రారంభించింది.

ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ప్రభాకర్‌కి కూడా ఎన్‌ఎస్‌యుఐ బాధ్యతలు చూసిన నాటి నుంచి హైదరాబాద్‌ నగరంతో సత్సంబంధాలు ఉన్నాయి. మంత్రి పొన్నంను అలాగే కొనసాగిస్తూ సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఏదిఏమైనా మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో ఈ సారి హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని సిటీ కాంగ్రెస్‌ నాయకులు ధీమాగా ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com